ది కేరళ స్టోరీ సినిమా విడుదలపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. ఈ పిటిషన్ పై మంగళవారం వాదనలు జరిగాయి. అనంతరం, సినిమా విడుదలపై స్టే విధించలేమని, సినిమా సర్టిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సరైన వేదికను ఆశ్రయించాలని సూచించింది. ఇప్పటికే సినిమాను సర్టిఫై చేసి విడుదలకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

న్యూఢిల్లీ: హిందీ ఫిలిమ్ ది కేరళ స్టోరీ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వాదనలు విన్నది. ఆ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని స్పష్టం చేసింది. దీని గురించి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పని లేదని, సర్టిఫికేషన్ బోర్డును ఆశ్రయించాలని సూచించింది. ఈ సినిమా అత్యంత దారుణమైన హేట్ స్పీచ్ అని పిటిషనర్ తరఫు న్యాయవాదులు అన్నారు.

సుదీప్తో సేన్ దర్శకత్వం, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాణంలో మత మార్పిళ్లు ఆధారంగా అదా శర్మ నాయకిగా ది కేరళ స్టోరీ సినిమా మే 5వ తేదీన థియేటర్‌లలో విడుదల అవుతున్నది. 

మే 2వ తేదీన ఈ సినిమా విడుదలపై స్టే కావాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు వాదనలు విన్నది. ఈ పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్, అడ్వకేట్ నిజాం పాషాలు వాదించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైందని, ఈ ట్రైలరర్‌కు 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయని తెలిపారు. ఇది అత్యంత దారుణమైన హేట్ స్పీచ్ అని వాదించారు.

Also Read: కర్ణాటకలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో.. బజరంగ్ దళ్, పీఎఫ్ఐ‌లపై నిషేధం.. ఆ చట్టాల రద్దు

సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనలపై స్పందిస్తూ చాలా రకాల విద్వేష ప్రసంగాలు ఉంటాయని తెలిపింది. ఈ సినిమాను సర్టిఫై చేసి విడుదలకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేసింది. సినిమా విడుదలపై స్టే కోరడానికి బదులు సరైన వేదిక పై ఈ సినిమా సర్టిఫికేషన్‌ను సవాల్ చేయాలని సూచించింది.

అవసరమైన ఫలితం కోసం సమగ్ర రిట్ పిటిషన్ వేయాలని జస్టిస్ జోసెఫ్ సూచించారు. ముందు హైకోర్టులో ఈ పిటిషన్ ఫైల్ చేయాలని జస్టిస్ నాగరత్న తెలిపారు. సమయం లేదని, శుక్రవారం ఈ సినిమా విడుదల అవుతున్నదని అడ్వకేట్ నిజాం పాషా చెప్పారు.

పాషా వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. సినిమా విడుదలపై స్టే కోరడానికి ఇది సరైన కారణం కాదని తెలిపింది. ఇలాంటి విషయాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని హెచ్చరించింది.