బీజేపీనుండి సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 

న్యూఢిల్లీ: Supreme Court లో నుపుర్ శర్మకు ఊరట లభించింది. BJP నుండి సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్మపై ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది. తనపై నమోదైన 9 పిటిషన్లను కలిపి విచారించాలని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించింది ఉన్నత న్యాయస్థానం.

ఈ ఏడాది మే 26న జరిగిన ఓ టీవీ చర్చలో మహ్మాద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై దాఖలైన ఎఫ్ఐఆర్ లతో పాటు భవిష్యత్తులో ఆమెపై నమోదయ్యే ఫిర్యాదుల విషయమై ఆగష్టు 10వ తేదీ వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

తన అరెస్టుపై స్టే విధించాలని కోరుతూ నుపుర్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు నుపుర్ శర్మపై దేశంలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లను కలపలని కూడా ఆమె కోర్టును కోరింది. ఈ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్ , పార్ధివాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. నుపుర్ శర్మకు భద్రత కల్పించే విధానాన్ని అన్వేషించాలని కూనడా కేంద్రానికి ఎఫ్ఐఆర్ లు నమోదైన రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులు పంపింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లపై ఉపశమనం పొందేందుకు సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు జూలై 1న ఆదేశించింది. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలను ఉన్నత న్యాయస్థానంలో నుపుర్ శర్మ న్యాయవాది వివరించారు. ఆజ్మద్ దర్గాకు చెందిన ఖాదీమ్ తో పాటు మరికొందరు నుపుర్ శర్మ ను బెదిరించారని విషయాన్ని చెప్పారు. దీంతో ప్రాణాలకు తెగించి ఆయా రాష్ట్రాలకు వెళ్లడం సాధ్యం కాదని నుపుర్ శర్మ తరపు న్యాయవాది మణిందర్ సింగ్ చెప్పారు.

జస్టిస్ సూర్యకాంత్ , జేబీ పార్దివాలతో కూడిన ధర్మాసనం నుపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీలోనే అన్ని ఎఫ్ఐఆర్ లను ఎందుకు కలపకూడదని కూడా ప్రశ్నించింది. నుపుర్ శర్మకు తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయన్నారు. 

నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్ లలో ఆమెను అరెస్ట్ చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది., అదే స్టేట్ మెంట్ కు సంబంధించి భవిష్యత్తులో నమోదయ్యే ఏ ఎఫ్ఐఆర్ లోనూ ఆమెను అరెస్ట్ చేయవద్దని కూడా ఉన్నత న్యాయస్థానం కోరింది. అయితే ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీ వరకే ఎలాంటి బలవంతపు చర్యలు వద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ పిటిషన్ పై ఈ ఏడాది ఆగష్టు 10న విచారణ నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.