ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలపై కేసుల నమోదుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వు పరిధిని సుప్రీం కోర్టు ఈరోజు పొడిగించింది. 

న్యూఢిల్లీ: ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలపై కేసుల నమోదుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వు పరిధిని సుప్రీం కోర్టు ఈరోజు పొడిగించింది. దేశంలోని లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేసే ద్వేషపూరిత ప్రసంగాన్ని తీవ్రమైన నేరంగా పేర్కొంటూ.. ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా అలాంటి నేరాలపై కేసులు నమోదు చేయాలని అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. కేసులు నమోదు చేయడంలో జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ద్వేషపూరిత ప్రసంగం దేశంలోని లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేయగలదని పేర్కొంది.

2022 అక్టోబర్‌లో ద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ను సుమోటోగా నమోదు చేయాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వు.. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు మాత్రమే ఆమోదించబడింది. తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ఉత్వర్వును సుప్రీం కోర్టు పొడిగించింది. దీంతో ద్వేషపూరిత ప్రసంగాలపై ఎటువంటి అధికారిక ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా.. సుమోటోగా కేసు నమోదు చేసేందుకు సుప్రీం కోర్టు అవకాశం కల్పించింది. ద్వేషపూరిత ప్రసంగం చేసే వ్యక్తి మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించేందుకు సంకోచిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించబడుతుందని హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా విద్వేషపూరిత నేరాలకు సంబంధించిన వివిధ కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ల బ్యాచ్‌ను న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది నిజాం పాషా (పిటిషనర్ షాహీన్ అబ్దుల్లా తరుపున) దాఖలు చేసిన దరఖాస్తుపై ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘‘ప్రసంగకర్త మతంతో సంబంధం లేకుండా అటువంటి చర్య తీసుకోబడుతుందని మేము మరింత స్పష్టం చేస్తున్నాము. తద్వారా ప్రవేశిక ద్వారా రూపొందించబడిన భారతదేశం లౌకిక స్వభావం సంరక్షించబడుతుంది’’అని ధర్మాసనం ఈ రోజు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.