ట్రైన్ జాప్యంతో ఫ్లైట్ మిస్ అయిన ఓ వ్యక్తికి రూ. 30వేల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. లేట్‌కు కచ్చితంగా అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: ట్రైన్ ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం పడిగాపులు కాస్తున్నప్పుడు ‘నేను ఎక్కాల్సిన రైలు ఎప్పుడూ జీవితకాలం లేటు’ అన్న కవి ఆరుద్ర మాటలు సమంజసమేనని అనిపిస్తుంది. ట్రైన్ సమయానికి వస్తే కదా ఆశ్చర్యమంటూ ఛలోక్తులూ అప్పుడప్పుడు వింటుంటాం. జనజీవనంలో ట్రైన్ ఆలస్యమనే పదం పరిపాటిగా మారిపోయింది. కానీ, సుప్రీంకోర్టు మాత్రం ట్రైన్ ఆలస్యాన్ని తీవ్రంగా ఖండించింది. కచ్చితంగా దానికి బాధ్యత వహించాలని, సేవలకు జవాబుదారీతనం వహించాల్సిందేనని స్పష్టం చేసింది.

ట్రైన్ లేట్ కారణంగా ఫ్లైట్ మిస్ అయిన ఓ వ్యక్తికి రూ. 30వేల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రైన్ ఆలస్యానికి రైల్వే శాఖ సరైన వివరణ ఇవ్వకపోతే సేవల్లో అంతరాయాలున్నాయని ఫిర్యాదు చేసిన వ్యక్తికి పరిహారం చెల్లించాల్సిందేని స్పష్టం చేసింది. 

2016 జూన్ 11న సంజయ్ శుక్లా జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. జమ్ముకు వెళ్లాడానికి కుటుంబసమేతంగా ట్రైన్ ఎక్కారు. షెడ్యూల్ ప్రకారం ఆ ట్రైన్ ఉదయం 8.10 గంటలకు జమ్ము చేరుకోవాలి. కానీ, ఆ రోజు నాలుగు గంటల ఆలస్యంతో మధ్యామ్నం 12 గంటలకు చేరుకుంది. దీంతో శుక్లా ఫ్లైట్ అందుకునే అవకాశమే లేకపోయింది. దీంతో ఆయన ఓ ట్యాక్సీని హైర్ చేసుకుని రూ. 15వేలు పెట్టి కుటంబసమేతంగా శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ గడపడానికి లాడ్జింగ్ కోసం మరో రూ. 10వేలు వెచ్చించాల్సి వచ్చింది. తనకు జరిగిన అంతరాయాన్ని ఆయన కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ రైల్వే శాఖను తప్పుపట్టింది. సేవలు అందించడంలో ప్రైవేటురంగాలతో పోటీపడాలని, ఇలా జవాబుదారీతనం లేకుండా జాప్యం చేయడం తగదని హితవుపలికింది. ప్రయాణికుల సమయం అమూల్యమైనదని తెలిపింది. ట్రైన్ జాప్యానికి పరిహారం చెల్లించాలని రైల్వేను ఆదేశించింది.