Asianet News TeluguAsianet News Telugu

మార్గదర్శి, రామోజీరావులకు సుప్రీంకోర్టు నోటీసులు.. కౌంటర్లకు ఆదేశాలు...

చట్ట విరుద్ధంగా వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారంటూ మర్గదర్శి  ఫైనాన్షియర్స్, రామోజీరావులపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. 

Supreme Court notices to Margadarshi and Ramoji Rao, delhi
Author
First Published Sep 20, 2022, 8:56 AM IST

న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ తో పాటు.. దాని అధినేత రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలని నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టి వేస్తూ.. ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో  కౌంటర్లు  దాఖలు  చేయాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే, ఇదే వ్యవహారంలో హైకోర్టు నుంచి సానుకూల తీర్పు పొందిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ దాఖలు చేసిన పిటిషన్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన డిపాజిటర్లకు తిరిగి పూర్తి డిపాజిట్లు చెల్లించిందా? లేదా?  అనే వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ సుప్రీం కోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు…
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించినందుకు చట్టప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలంటూ 2008లో సిఐడి అధీకృత అధికారి టి.కృష్ణరాజు నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని కొట్టివేస్తూ హైకోర్టు విభజనకు ఒక రోజు ముందు అంటే 2018 డిసెంబర్ 31కంటే ముందు.. అప్పటి న్యాయమూర్తి  జస్టిస్ తేలప్రోలు రజనీ (ప్రస్తుతం ఎన్ సీఎల్ టీ  సభ్యురాలు, అమరావతి బెంచ్) తీర్పునిచ్చారు.

మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఈ తీర్పును సవాలు చేస్తూ 2018లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2020లో ఇదే వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై తాజాగా జస్టిస్ సూర్యకాంతి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఆ వ్యాజ్యాన్ని కూడా కలిపి విచారించండి..
 ఉండవల్లి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్,  న్యాయవాది రమేష్ అల్లంకి వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శి రికార్డులు తనిఖీ చేయడానికి.. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం రెండు జీవోలు విడుదల చేసి విచారణ అధికారిని నియమించిందని అన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మార్గదర్శి హ కోర్టును ఆశ్రయించిందని, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వచ్చిందని తెలిపారు. ఆ కేసు అప్పటి నుంచి పెండింగ్లో ఉందని దానిని కూడా ఈ వ్యాఖ్యలకు జత చేసి తమ వాదనలు వినాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ ఈ అంశాన్ని తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

తనిఖీలకు ఏమాత్రం సహకరించలేదు..
మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ డిపాజిట్ దారులు అందరికీ సొమ్మును తిరిగి ఇచ్చేసిందా? అని ఏపీ ప్రభుత్వాన్ని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ స్పందిస్తూ అకౌంట్ లను తనిఖీ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వలేదని నివేదించారు. తనిఖీలకు ఏమాత్రం సహకరించలేదు అన్నారు. హిందూ కుటుంబం (హెచ్ యూఎఫ్) పేరిట అందరి నుంచి డిపాజిట్లు తీసుకోవడం ఆర్బీఐ చట్టప్రకారం నేరమని, దీనిపైనే ప్రధానంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనానికి విన్నవించారు.

డిపాజిట్ దారులు అందరికీ సొమ్మును తిరిగి వచ్చాయా? లేదా అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత చెబుతామని వికాస్ సింగ్ తెలిపారు. ఆ వివరాలు సేకరించి తమ ముందు ఉంచాలని వికాస్ సింగం ధర్మాసనం స్పష్టం చేసింది. మార్గదర్శి దాఖలు చేసిన కేసు విచారించిన ధర్మాసనం ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎవరైనా హాజరయ్యారా?  అని ధర్మాసనం ప్రశ్నించగా ఎవరూ రాలేదని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా బదులిచ్చారు.

ఆయన కోర్టుకు ఎందుకు వచ్చారు…
హైకోర్టులో కేసు గెలిచినప్పటికీ రామోజీరావు సుప్రీం కోర్టుకు ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆయనకు సంతృప్తినివ్వలేదేమో అని వ్యాఖ్యానించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రామోజీరావుపై తనకేమీ కక్ష లేదని, జైల్లో పెట్టించాలని తనకేమీ లేదని ఉండవల్లి తెలిపారు. చట్టానికి రామోజీరావును అతీతుడిని చేయకూడదనే.. సమాజానికి, ధర్మానికి హాని జరగకూడదనేదే తన ఉద్దేశమని అన్నారు.

హెచ్ యూఎఫ్ ద్వారా డిపాజిట్లు సేకరించవచ్చు అంటే రామోజీ మాత్రమే కాకుండా అందరూ సేకరించవచ్చు అన్నారు.  డిపాజిట్లు ఇస్తే ఇస్తారు.. లేకపోతే లేదు అనేది తర్వాతి అంశమని అన్నారు. మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. మార్గదర్శి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.. కాబట్టి ఇకపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ వేయక తప్పదు అని అన్నారు. మార్గదర్శి వ్యవహారాన్ని ఇటీవలనే తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకురాగా... అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామని చెప్పారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్న క్రమంలో కేసు ఓ తార్కిక ముగింపునకు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. ఈ అంశంపై కేవలం తాము హెచ్ యూఎఫ్ వరకే తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డిపాజిటర్లకు సొమ్ములు అందాయా లేదా? అని తనిఖీ చేసేందుకు గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారిని నియమించగా కొందరు డిపాజిట్ దారులు అసోసియేషన్ గా ఏర్పడి కోర్టుకు వెళ్లారని అన్నారు.  తమ పేర్లు బయటపడితే వైఎస్ఆర్ కక్ష సాధిస్తారని భయంగా ఉంది అని కోర్టు నుంచి స్టే తెచ్చారని అని ఉండవల్లి తెలిపారు.  ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని వివరాలు సేకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో అన్ని అంశాలు బయటకు వస్తాయని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios