New Delhi: తమిళనాడులో ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేననీ, తమ ర్యాలీని అడ్డుకోవడం సమంజసం కాదన్న ఆర్‌ఎస్‌ఎస్ వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంగీకరించారు.
Supreme Court gives permission to RSS rally: సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర అప్పీల్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. తమిళనాడులో ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, తమ ర్యాలీని అడ్డుకోవడం సమంజసం కాదన్న ఆర్‌ఎస్‌ఎస్ వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంగీకరించారు.
అంతకుముందు, గుర్తించిన ప్రదేశాలు, పలు ఆంక్షలతో సహా కొన్ని షరతులతో ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహించడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై ఆర్ఎస్ఎస్ తరఫున మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని అంగీకరించిన హైకోర్టు ర్యాలీకి అనుమతి ఇచ్చింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ర్యాలీ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉందని తమిళనాడు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. "పరిస్థితుల దృష్ట్యా మైదానం సహా పలు చోట్ల ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ర్యాలీపై పూర్తి నిషేధం విధించలేదు. సమస్యలున్న చోట్ల మాత్రమే అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం. దాని ప్రభావం ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసిందని" కోర్టుకు తెలిపారు.
అయితే దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ర్యాలీ జరగడం నిత్యకృత్యమనీ, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మమ్మల్ని అణచివేయడం అన్యాయమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫు న్యాయవాది పర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వాదించారు. జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన అనుమతిని స్వీకరించి తమిళనాడు ప్రభుత్వ అప్పీల్ ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే తమిళనాడులో ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ కు అనుమతి లభించింది. కాగా, ఈ తీర్పుపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
