న్యూఢిల్లీ:  ఎన్నికలకు ఆరు మాసాల ముందు నగదు బదిలీ పథకాలపై కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై వివరణ ఇవ్వాలని  కూడ ఆయా రాష్ట్రాలను సుప్రీం ఆదేశించింది. అంతేకాదు ఎన్నికలకు ముందు  నగదు బదిలీ పథకాలు ఉండకుండా నిషేధం విధించాలని కూడ పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.

ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై నిషేధం విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం నాడు విచారించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, ఈసీలకు సుప్రీంకోర్టు  నోటీసులు జారీ చేసింది.  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందని పిటిషనర్‌ సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. ఎన్నికల సమయంలో అమలు చేసిన ఈ పథకాలను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని విన్నవించారు.