Asianet News TeluguAsianet News Telugu

కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం... సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు, 33కి చేరిన జడ్జిల సంఖ్య

సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులుగా  నియమితులయ్యారు. ఈ మేరకు చీఫ్ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదం తెలిపారు. వీరి రాకతో సుప్రీంలో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరుకుంది.
 

Supreme Court gets 9 new judges
Author
New Delhi, First Published Aug 26, 2021, 9:30 PM IST

సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదం తెలిపారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కి పెరనుండగా.. ఒకే ఒక్క ఖాళీ మాత్రమే మిగులుతుంది. వీరు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులను, అందులోనూ ముగ్గురు మహిళా న్యాయమూర్తులను నియమించడం ఇదే ప్రథమం.

తొమ్మిది మందితో కూడిన కొత్త న్యాయమూర్తుల జాబితాను చీఫ్‌ జస్టిస్‌ చేసిన సిఫార్సులను పరిశీలించిన న్యాయశాఖ వాటిని ప్రధాని కార్యాలయానికి పంపించింది. ఈ నెల 17వ తేదీన చీఫ్‌ జస్టిస్‌ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం ఆ జాబితా అక్కడి నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లగా.. కొలీజియం సిఫార్సులకు ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండానే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. వీరి నియామకానికి సంబంధించి న్యాయశాఖ త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.  

కొత్త న్యాయమూర్తుల్లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, సీనియర్‌ అడ్వకేట్‌ పి.ఎస్‌.నరసింహ ఉన్నారు. వీరిలో జస్టిస్‌ బీవీ నాగరత్నకు 2027లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది.  అదే జరిగితే భారత సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్న చరిత్ర సృష్టించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios