బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు... 11మందికి క్షమాభిక్ష రద్దు..
తీర్పును రిజర్వ్ చేస్తూ, 11 మంది దోషుల శిక్షను తగ్గించడానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను అక్టోబర్ 16లోగా సమర్పించాలని కేంద్రాన్ని, గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.
ఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో సోమవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 11 దోషులకు క్షమాభిక్ష రద్దు చేసిన సుప్రీంకోర్టు. దీంతో ఈ తీర్పు సంచలనంగా మారింది.
2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేసిన కేసులో 11 మంది దోషులకు మంజూరు చేసిన ఉపశమనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.
బానో దాఖలు చేసిన పిటిషన్‌తో సహా 11 రోజుల విచారణ తర్వాత జస్టిస్ బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 12న తన తీర్పును రిజర్వ్ చేసింది.
బిల్కిస్ బానో కేసులో దోషుల రెమిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంపై దాడి కేసులో దోషులుగా ఉన్న 11మందిని జైలునుంచి ముందుగానే విడుదల చేశారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ సుప్రీం నేడు ఈ తీర్పు వెలువరించింది.