చీతాల మరణం.. ఈ విషయాన్ని ఎందుకింత ప్రతిష్టాత్మకంగా మారుస్తున్నారు : కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల మృతిపై సుప్రీంకోర్ట్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఎందుకింత ప్రతిష్టాత్మకంగా మారుస్తున్నారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

భారత ప్రభుత్వం ప్రత్యేకంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒకదాని వెంట ఒకటి మరణిస్తూ వుండటం జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల మృతిపై సుప్రీంకోర్ట్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ లోకేషన్‌లో 50 శాతం మరణాలు సాధారణమేనని సుప్రీంకోర్టుకు తెలిపింది.
చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతవారం రెండు చీతాలు చనిపోవడాన్ని ప్రస్తావించిన సుప్రీం.. దీనిని ఎందుకు ప్రతిష్టాత్మకంగా మారుస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. చీతాలను ఒకే చోట ఎందుకు పెట్టారని నిలదీసింది.
ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ఆపరేషన్ చీతా ప్రాజెక్ట్ కోసం తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రాన్స్ లోకేషన్‌లో 50 శాతం మరణాలు సాధారణమేనని ఆమె వివరించారు. అయితే వన్యప్రాణులు భారతదేశ వాతావరణానికి సరిపోతాయా, కిడ్నీ, శ్వాస కోశ సమస్యలను ఎదుర్కొంటున్నాయా అనే అంశాన్ని తెలుసుకోవాలని కోర్ట్ ఆదేశించింది. అంటువ్యాధులు వాటి మరణాలకు దారితీస్తున్నాయని ఐశ్వర్య సమాధానమిచ్చారు. రాజస్థాన్‌లోని అభయారణ్యాలలో ఒకటి చిరుతపులికి ప్రసిద్ధి చెందిందని కోర్ట్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ అంశాన్ని కేంద్రం పరిగణనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్ట్ సూచించింది.
కాగా.. ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను భారత ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తరలించిన సంగతి తెలిసిందే. భారతదేశంలో చీతాల సంతతిని నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి దక్షిణాఫ్రికాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందు గతేడాది సెప్టెంబర్ 17న తన పుట్టినరోజు సందర్భంగా కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. వాటిలో అనారోగ్యం కారణంగా ఒక చీతా మరణించింది.