కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదని.. వాటిపై నిషేధం విధించాలంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతని పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం అతనికే షాకిచ్చింది. పిటిషనర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని, ఆయన చేసిన వాదనలను నిరూపించలేకపోయారంటూ రూ.5లక్షల జరిమానా విధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన చావ్డా అనే వ్యక్తి కోకాకోలా, థమ్స్ అప్ ఆరోగ్యానికి హానికరం.. వాటిని నిషేధించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

పిటిషనర్ తరపు వాదనలు విన్న తరువాత  న్యాయమూర్తులు డి.వై.చంద్రచుడ్, హేమంత్ గుప్తా, అజయ్ రాస్తోగిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అతనికి షాకిచ్చింది.

 ‘పిటిషనర్ ఒక 'సామాజిక కార్యకర్త' అని చెప్పుకుంటున్నారు. పిటిషనర్‌కు ఈ విషయంపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే పిటిషన్ దాఖలైంది. అతని వాదనలు నిరూపించబడలేదు. అతనికి జరిమానా విధించడం సమంజసం. అందుకే అతడికి రూ. 5లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని తెలిపారు. 

ఒక నెలలోపు 5 లక్షల రూపాయలను టాప్ కోర్ట్ రిజిస్ట్రీలో జమ చేయాలని.. అదే మొత్తాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదుల రికార్డ్ అసోసియేషన్‌కు పంపిణీ చేయాలని కోర్టు చావ్డాను ఆదేశించింది.