న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాహుల్‌ గాంధీకి పౌరసత్వంపై దాఖలైన పిటీషన్ ను సర్వోన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. 

రాహుల్‌ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని అందువల్ల ఆయనను ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా బహిష్కరించేలా ఈసీని ఆదేశించాలన్న పిటీషనర్ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 

ఢిల్లీకి చెందిన జై భగవా్ గోయల్, చందర్ ప్రకాశ్ త్యాగి అనే ఇద్దరు యువకులు వారం రోజుల క్రితం దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఇరు వాదనలు విన్న సుప్రీం కోర్టు పిటీషన్ ను కొట్టివేసింది. 

అలాగే లండన్‌కి చెందిన బ్యాకోప్స్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపక సర్టిఫికెట్, ఆ కంపెనీ దాఖలు చేసిన రిటర్నులే రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని చెప్పడానికి ఆధారమని పిటిషనర్లు వాదించారు. ఇకపోతే 2015లో కూడా రాహుల్‌ గాంధీపై ఇదే తరహాలో పిటీషన్ దాఖలైంది. అప్పుడు కూడా సుప్రీం కోర్టు కేసు కొట్టివేసిన విషయం తెలిసిందే.