రజనీకాంత్ భార్యపై ఛీటింగ్ కేసు: పునరుద్దరణకు సుప్రీం ఆదేశం
సినీ నటుడు రజనీకాంత్ భార్యపై ఛీటింగ్ కేసును పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: రజనీకాంత్ భార్య లతపై ఛీటింగ్ కేసును పునరుద్దరించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత కొచ్చాడియన్ అనే సినిమా పోస్టు ప్రొడక్షన్ కోసం తమకు చెల్లించాల్సిన డబ్బులను మళ్ళించారనే ఆరోపణలపై దాఖలైన ఛీటింగ్ కేసును పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో డిశ్చార్జ్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం లేదా విచారణ ప్రక్రియను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఎ.ఎస్ బొప్పన, ఎం.ఎం సుందరేశ్ ధర్మాసనం ఇవాళ పేర్కొంది.
రజనీకాంత్ దీపికా పడుకొనే నటించిన కొచ్చాడియన్ సినిమాకు సంబంధించిన అడ్వర్టైజింగ్ సంస్థకు రూ. 6.20 కోట్లు చెల్లించడంలో లతా రజనీకాంత్ వైఫల్యం చెందారని కేసు నమోదైంది.యాడ్ ఏజెన్సీకి చెల్లించాల్సిన డబ్బులను రజనీకాంత్ సతీమణి ఇతర మార్గాలకు మళ్లించారని యాడ్ సంస్థ ఆరోపించింది.
2018లో ఇదే వివాదంలో ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ సవాల్ చేశారు.ఈ విషయమై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేసు మెరిట్ పై తాము వ్యాఖ్యానించదల్చుకోలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కర్ణాటక హైకోర్టు రజనీకాంత్ సతీమణి లతపై దాఖలైన కేసును కొట్టివేయడాన్ని చెన్నైకి చెందిన యాడ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.2022 ఆగస్టు 2న రజనీకాంత్ భార్య లతపై కర్ణాటక హైకోర్టు కేసును కొట్టివేసింది.