కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై పిల్.. తిరస్కరించిన సుప్రీం కోర్టు..
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం పిటిషనర్ వ్యక్తిగత న్యాయవాది జయ సుకిన్‌తో మాట్లాడుతూ.. ఈ పిటిషన్ ఎందుకు, ఎలా దాఖలు చేయబడిందో కోర్టుకు అర్థమైందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి మొగ్గు చూపడం లేదని అన్నారు.
ఆర్టికల్ 79 ప్రకారం దేశానికి అధ్యక్షుడే ఎగ్జిక్యూటివ్ హెడ్ అని.. ఆమెను ఆహ్వానించి ఉండాల్సిందని సుకిన్ అన్నారు. అయితే కోర్టు పిటిషన్‌ను స్వీకరించడానికి ఇష్టపడకపోతే.. దానిని ఉపసంహరించుకోవడానికి అనుమతించమని కోరారు. దీంతో ధర్మాసనం పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టుగా కొట్టివేసింది.
ఇక, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్ జారీ చేసిన ఆహ్వానం రాజ్యాంగ ఉల్లంఘనేనని న్యాయవాది జయ సుకిన్ దాఖలు చేసిన పిల్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించేందుకు లోక్‌సభ సెక్రటేరియట్‌కు దిశానిర్దేశం చేయాలని కోరారు.
ఇదిలా ఉంటే.. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దాదాపు 25 పార్టీలు హాజరవుతాయని భావిస్తుండగా.. 20 ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం బీజేపీలో నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో 18 పార్టీలు ఉండగా.. ఏడు ఎన్డీయేతర పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి. బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (సెక్యులర్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ, టీడీపీలు ఈ వేడుకకు హాజరవుతాయని భావిస్తున్నారు.
ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులుగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నట్టుగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీతో సహా పలు విపక్ష పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే.