మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎం గోపాల్ రెడ్డికి  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ముందుకు వెళ్లొచ్చంటూ ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. 

ఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి ఏం గోపాల్ రెడ్డికి.. అక్కడ జరిగిన ఈ టెండరింగ్ కుంభకోణంలో తెలంగాణ హైకోర్టు 2021లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ.. గోపాల్ రెడ్డికి బెయిల్ ఇచ్చే విషయంలో తెలంగాణ హైకోర్టు ప్రాతిపదికగా తీసుకున్న అంశాలు ఏవి నిలిచేవి కావని తెలిపింది. నేరారోపణలో తీవ్రతను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ఎం గోపాల్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. 2019లో మధ్యప్రదేశ్ జలవరణం శాఖలో గోపాల్ రెడ్డి అదనపు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.

ఆ సమయంలో జరిగిన వివిధ పనులకు ఆహ్వానించిన ఈ టెండరింగ్ లో కుంభకోణాలు చోటు చేసుకున్నట్లు గుర్తించడంతో పోలీసులు గోపాల్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. గోపాల్ రెడ్డి హయాంలో తీవ్రమైన ఆర్థిక నేరాలు చోటు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును ఈడీకి అప్పగించారు. ఈ మేరకు 2019లో ఈడీ రంగంలోకి దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లోని ఆర్థిక నేరాల విభాగం ఈ టెండరింగ్ కుంభకోణంలో గోపాల్ రెడ్డితో సహా మరో 20 మంది వ్యక్తులు/ కంపెనీలు లబ్ది పొందాయని పేర్కొంటూ వారి మీద కేసు నమోదు చేసింది. మధ్యప్రదేశ్లోని ఎంపీ ఎస్సీడీసీని, ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ను ఆంత్రా’స్ సిస్టమ్స్, టిసిఎస్ లు నిర్వహించేవి. 

ట్విట్టర్‌లో #HeartAttack ట్రెండింగ్ .. వైరల్ కావడానికి అసలు కారణమేంటీ ?

అయితే వీటిలో రిగ్గింగ్లు జరిగాయి. కొందరు అధికారులు బిల్డర్ల నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకొని ఈ రిగ్గింగ్ లకు పాల్పడ్డారు. ఆంత్రాస్ సిస్టమ్స్ తో పాటు ఒస్మో ఐటీ సొల్యూషన్స్ తో కుమ్మక్కయ్యారు. అలా ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ లో రిగ్గింగ్ కు పాల్పడ్డారు. దీంతో తాము అనుకున్న వారికి టెండర్లు వచ్చేలా చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు చెందిన మ్యాక్స్ మంతెన మైక్రో జేవీ అత్యధికంగా రూ.1020 కోట్ల విలువైన పనులను దక్కించుకుంది. ఈ మేరకు భారీగా లబ్ధి పొందిందని ఈడీ దర్యాప్తులో గుర్తించింది. 

దీని మీద కేసు నమోదు చేసింది. అప్పటి జలవనుల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ఏం గోపాల్ రెడ్డిని ఈ కుంభకోణానికి సంబంధించి విచారించింది. హైదరాబాదులోని అంత్రాస్ ప్రైవేట్ లిమిటెడ్, మంతెన కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్, ఆర్మీ ఇన్ ఫ్రా, ఒస్మో ఐటీ సొల్యూషన్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన గోపాల్ రెడ్డి 2021లో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ ఈడి అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సిటీ రవికుమార్ తో కూడిన దిసభ్య ధర్మాసనం కేసు పూర్వాపరాలు, నిందితుడు, ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్నారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును పక్కన పెడుతూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. చట్ట ప్రకారం గోపాల్ రెడ్డి మీద ముందుకు వెళ్లచ్చని ఈడీకి ధర్మాసనం సూచించింది. గోపాల్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత.. బెయిల్ తీసుకోవడానికి ఆయనకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవచ్చని అదే సమయంలో సుప్రీంకోర్టు పేర్కొంది.