Asianet News TeluguAsianet News Telugu

బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై సుప్రీంకోర్టు విచారణ.. బిల్కిస్ బానో కేసు ఏమిటీ?

బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీజేఐ ఎన్వీ రమణ ఈ పిల్‌ను విచారించడానికి అంగీకరించారు. రేపు ఈ కేసు లిస్టింగ్ జరగొచ్చు. శుక్రవారం నుంచి విచారణ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

supreme court agreed to hear pil which challenging bilkis bano case convicts remission order of gujarat govt
Author
First Published Aug 23, 2022, 1:04 PM IST

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన క్షమాభిక్ష పెడుతూ వారిని విడుదల చేసే నిర్ణయం తీసుకోవడంపై గుజరాత్ ప్రభుత్వాన్ని హక్కుల కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. శుక్రవారం నుంచి ఈ పిల్ విచారణ ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. త్వరలో వీటిపై స్పష్టత రానుంది.

ఈ పిల్‌ను అడ్వకేట్ అపర్ణ భట్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ముందు ప్రస్తావించారు. రేపే అర్జెంట్‌గా లిస్టింగ్ చేయాలని కోరారు. ఈ అంశాన్ని విచారించడానికి సీజేఐ ఎన్వీ రమణ అంగీకరించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ ఓ ప్రశ్న వేశారు. ఆ క్షమాభిక్ష సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానాన్ని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఇచ్చారు.

సుప్రీంకోర్టు కేవలం ఆ విషయాన్ని పరిశీలించండి అని మాత్రమే గుజరాత్ ప్రభుత్వానికి చెప్పిందని గుర్తు చేశారు. అయితే, దానిపై నిర్ణయం తీసుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టిందని వివరించారు. తాము సుప్రీంకోర్టు ఆదేశాలను సవాల్ చేయడం లేదని, కేవలం గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్ష నిర్ణయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నామని తెలిపారు.

గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ, జర్నలిస్ట్ రేవతి లౌల్, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మలు పిల్ వేశారు.

ఈ పిల్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. బిల్కిస్ బానో దోషులకు ప్రసాదించిన క్షమాభిక్షను రద్దు చేయాలని కార్యకర్తలు, చరిత్రకారులు సహా సుమారు ఆరు వేల మంది సుప్రీంకోర్టును కోరారు.

ఈ కేసు ఏమిటీ?

ఈ కేసుకు సంబంధించిన దుర్ఘటన 2002లో గుజరాత్‌లో జరిగింది. అప్పుడు బిల్కిస్ బానోకు 20 ఏళ్లు. గర్భిణి. గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పై జరిగిన దాడిలో 59 మంది ప్రయాణికులు (అందులో ఎక్కువ మంది కర సేవకులు ఉన్నారు) మంటల్లో కాలి మరణించారు. ఈ దాడి తర్వాత 2022 మార్చి 3వ తేదీన దాహోద్ హింస చెలరేగినప్పుడు 14 మందిని ఓ మూక దారుణం హతమార్చింది. ఈ హింసలోనే బిల్కిస్ బానోను గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె కళ్ల ముందే ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని పొట్టనబెట్టుకున్నారు. అందులో ఆమె 3 ఏళ్ల కూతురు సలేహా కూడా ఉన్నారు.

గ్యాంగ్ రేప్ తర్వాత దాదాపు చావు అంచుల దాకా వెళ్లిన ఆమె స్పృహలోకి వచ్చి ఓ గిరిజన మహిళ నుంచి బట్టలు అడుక్కుని కట్టుకుంది. దాహోద్ జిల్లాలోని లింఖేదా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ, హెడ్ కానిస్టేబుల్ ఆ ఫిర్యాదును నిర్లక్ష్యంగా తేలిపోయేట్టు రాశాడు. అప్పటి నుంచి ఆమె న్యాయం కోసం పోరాటం ఏళ్ల తరబడి జరిగింది.

ఎట్టకేలకు 2008లో ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 20 మంది నిందితుల్లో 11 మందిని గర్భిణిపై అత్యాచారం, హత్య, చట్టవ్యతిరేకంగా పోగయ్యే కుట్రలో దోషులుగా తేల్చింది. నిందితులను కాపాడటానికి తప్పుగా రికార్డు చేసిన అభియోగాల్లో ఆ హెడ్ కానిస్టేబుల్ దోషిగా తేలాడు. 20 మందిలో ఏడుగురు సరైన సాక్ష్యాధారాలు లేక నిర్దోషులుగా బయటపడ్డారు. ట్రయల్ జరుగుతున్న కాలంలో ఒకరు మరణించాడు. 

బిల్కిస్ బానోపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో చాలా మంది దాదాపుగా ఆమెకు తెలిసినవారే కావడం విషాదకరం. అందులో ఒకరిని ఆమె చాచా అని పిలిచేది. ఇతరులను సోదరులుగా సంబోధించేది.

Follow Us:
Download App:
  • android
  • ios