సూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఫైర్ అయ్యారు. గత వారం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన అంత్యక్రియలను చెన్నైలోని మెరీనా బీచ్ లో నిర్వహించారు. అయితే.. ఈ అంత్యక్రియలకు ప్రస్తుత ముఖ్యమంత్రి గైర్హాజరవ్వడం గమనార్హం.

దీనిపై రజినీకాంత్ తీవ్ర స్థాయిలో మండపడ్డారు. పళనిస్వామి.. కరుణానిధి కన్నా గొప్పవాడా అని ప్రశ్నించారు. పళనిస్వామి తనని తాను ఎంజీఆర్, జయలలిత అనుకుంటున్నాడా.. అందుకే కరుణానిధి అంత్యక్రియలకు రాలేదా? అంటూ మండిపడ్డారు.

మెరీనా బీచ్ లో నిర్వహించిన అంత్యక్రియలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా.. పలువురు రాజకీయనేతలు హాజరయ్యారైన సంగతి తెలిసిందే. కాగా.. సోమవారం కరుణానిధి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజినీకాంత్ హాజరై మాట్లాడారు. స్టాలిన్ తో కలిసి సభకు వచ్చిన రజినీకాంత్..కొవ్వొత్తులు వెలిగించి కలైంజర్‌కు నివాళులర్పించారు.

 అనంతరం రజినీ మాట్లాడుతూ.. ‘‘కరుణానిధికి చివరి నివాళి అర్పించేందుకు దేశంలోని ప్రముఖ నేతలందరూ మెరీనా బీచ్‌‌కు వచ్చారు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు.. అతను కలైంజర్, జయలలిత కంటే గొప్పవాడా?’’ అని రజనీ ప్రశ్నించారు. కాగా కరుణానిధి భౌతికకాయానికి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం రాజాజీ హాల్‌లో నివాళులర్పించారు. కానీ మెరీనా బీచ్‌లో జరిగిన అంత్యక్రియలకు మాత్రం వాళ్లు హాజరుకాలేదు.