తమిళనాడు: తమిళనాడులో రజనీకాంత్, అజిత్ అభిమానులు కత్తులతో దాడికి దిగారు. వేలూరులోని ఓ థియేటర్లో ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడికి దిగడంతో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. 

సంక్రాంతి పండుగ పండుగలు పురస్కరించుకుని తమిళనాడులో ఒకే రోజు రెండు సినిమాలు విడుదలయ్యాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట, తలై అజిత్ నటించిన విశ్వాసం సినిమాలు విడుదలయ్యాయి. ఒకే రోజు కోలీవుడ్ లో భారీ చిత్రాలు విడుదలవ్వడంతో థియేటర్ల దగ్గర హడావిడి నెలకొంంది. 

తమ అభిమాన నటుల సినిమాలు విడుదల కావడంతో అభిమాన సంఘాలు తెగ సందడి చేశాయి. ఒక హీరో అభిమానులపై మరో హీరో అభిమానులు కామెంట్లు చేసుకోవడంతో గొడవకు దారి తీసింది. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఉద్రిక్త పరిస్థి నెలకొంది. 

వేలూరులోని ఓ థియేటర్ వద్ద అయితే ఫ్యాన్స్ కొట్లాటకు దిగడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇరువర్గాల అభిమానులు తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్ అంటూ ఒకరిపై ఒకరు మాటలకు దిగి చివరకు కత్తిపోట్లకు దిగారు. ఈ కత్తిపోట్ల దాడుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వినోదాలను పంచే సినిమాలను ఎంజాయ్ చెయ్యకుండా ఇలా దాడులకు దిగడం సరికాదని తమిళనాడు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హీరోపై అభిమానం ఉండొచ్చు కానీ ప్రాణాలు తీసేలా ఉండొద్దని హితవు పలుకుతున్నారు.