సైకిల్ జ్యోతి.. ఇప్పుడు ఈ పేరు దేశమంతటా వినపడుతోంది. లాక్ డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని సైకిల్‌పై  కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్ర‌యాణించి త‌మ ఇంటికి తీసుకువ‌చ్చింది. దీనిని కొందరు వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారాయి.

ఆమె తండ్రి కోసం పడిన తపన.. అమెరికా దేశాధ్యక్షుని కూతురు ఇవాంక ట్రంప్ ని కూడా ఆకట్టుకుంది. ఆమె ట్వీట్ తో ఈ సైకిల్ జ్యోతి ప్రపంచానికి కూడా చేరువైంది. కాగా.. ఈ నేప‌ధ్యంలో జ్యోతి కుమారి దేశ‌వ్యాప్తంగా అంద‌రి ప్రశంసలు అందుకుంటోంది. జ్యోతి ఏడు రోజుల్లో త‌న గ‌మ్యాన్ని చేరుకుంది.

కాగా.. ఈ సైకిల్ జ్యోతికి సూపర్ 30 ఆనంద్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. చదువుకోవాలని ఆసక్తి ఉండి.. పేదరికం కారణంగా చదువులేకపోతున్న చిన్నారులకు ప్రతి సంవత్సరం 30మందికి ఆనంద్ ఐఐటీ కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఆయన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్నవారందరూ ఐఐటీ లో చోటు దక్కించుకున్నవారే.

కాగా.. ఆయన ఇప్పుడు ఈ జ్యోతికి ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇవ్వడానికి ముందకు వచ్చారు. ఈ మేరకు ఆయన ప్రకటన కూడా చేశారు. ఆయన చేసిన ఆఫర్ ని ఆమె ఎలా తీసుకుంటుందో చూడాలి. కాగా.. జ్యోతికి చదువుకోవాలని ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తాను చదువుకోలేకపోయానని ఆమె ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. ఈ జ్యోతి కథ త్వరలో బాలివుడ్ లో సినిమాగా కూడా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. ఆమె క‌థ‌ను విన్న బలీవుడ్ నిర్మాత వినోద్ కప్రి సైకిల్ గ‌ర్ల్ జ్యోతిపై సినిమా చేయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా వినోద్ కప్రి మాట్లాడుతూ తాను ప్రస్తుతం కాలినడకనన‌, సైకిల్‌పై వెళ్లే వ‌ల‌స కార్మికులపై షార్ట్ ఫిల్మ్‌లు తీస్తున్నాన‌న్నారు. 

ఇప్పుడు  జ్యోతి క‌థాంశంతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాన‌ని తెలిపారు. ఇందుకోసం తాను ఆమె తండ్రితో కూడా మాట్లాడాన‌ని పేర్కొన్నారు. జ్యోతి నేడు లక్షలాది మంది అమ్మాయిలకు ప్రేరణ అని, అందుకే సినిమా తీయాల‌నుకుంటున్నాన‌ని వినోద్ కప్రి తెలిపారు.