PM Modi: ప్ర‌ధాని మోడీ వ‌ల‌స‌వాద వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. మ‌రీముఖ్యంగా  క‌రోనా స‌మ‌యంలో వల‌స‌వాదాన్ని ప్రోత్స‌హించేలా ఢిల్లీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకున్నద‌ని పేర్కొన‌డంపై కేజ్రీవాల్ మండిప‌డ్డారు. కేజ్రీవాల్ వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యానాధ్ ఖండించారు. ఈ నేప‌థ్యంలోనే యూపీ, ఢిల్లీ సీఎంల మ‌ధ్య ట్విట్ట‌ర్ లో వార్ కొన‌సాగుతోంది.  

PM Modi: ఒక వైపు ఐదు రాష్ట్రాలైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, గోవా అసెంబ్లీ ఎన్నిక‌లు, మ‌రోవైపు పార్ల‌మెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో.. వివిధ రాజ‌కీయ పార్టీల మ‌ధ్య కొన‌సాగుతున్న మాట‌ల యుద్దం రాజ‌కీయంగా కాకపుట్టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోడీ చేసిన క‌రోనా వ‌ల‌స‌వాద వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్‌లో జరుగుతున్న బడ్జెట్ సెషన్ లో భాగంగా లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో వలస సంక్షోభానికి ప్ర‌తిప‌క్షాల‌దే బాధ్యత అని అన్నారు. క‌రోనా సంబంధిత విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. 2020లో కోవిడ్ నియంత్రణలను ధిక్కరించడానికి వలసదారులను కేజ్రీవాల్ స‌ర్కారు ప్రేరేపిస్తోంద‌ని ప్ర‌ధాని మోడీ ఆరోపించారు. 

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న‌పై కేజ్రీవాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోడీ చేసిన వ్యాఖ్య‌లు ప‌చ్చి అబ‌ద్ద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాల రాజ‌కీయాలు చేయ‌డం ప్ర‌ధానికి త‌గ‌దంటూ హిత‌వు ప‌లికారు. “వలస సంక్షోభంపై ప్ర‌ధాని మోడీ చేసిన ప్రకటన పచ్చి అబద్ధం. కరోనా బాధలో ఉన్న వారి పట్ల, తమ ఆత్మీయులను కోల్పోయిన వారి పట్ల ప్రధాని సున్నితంగా వ్యవహరిస్తారని దేశం ఆశిస్తోంది. ప్రజల కష్టాలపై రాజకీయాలు చేయడం ప్రధానికి తగదు” అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్ చేశారు. 

ఇక కేజ్రీవాల్ చేసిన ప్ర‌కట‌న‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌లు.. అత్యంత ఖండించదగినద‌ని ఆయ‌న పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్ దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. "గౌరవనీయమైన ప్రధానమంత్రి గురించి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటన అత్యంత ఖండించదగినది. అరవింద్ కేజ్రీవాల్ యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలి" అని ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. గోస్వామి తులసీదాస్ "రామచరిత్మానస్" నుండి ఒక ద్విపదను ఉటంకిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "కేజ్రీవాల్‌కు అబద్ధాలు చెప్పే నేర్పు ఉంది. గౌరవనీయమైన ప్రధాని నాయకత్వంలో దేశం మొత్తం కరోనా వంటి ప్రపంచ మహమ్మారితో పోరాడుతున్నప్పుడు, కేజ్రీవాల్ వలస కార్మికులకు ఢిల్లీ నుండి బయటికి వెళ్ళే మార్గం చూపించారు" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వలస కూలీలను.. విద్యుత్, నీటి కోతతో వారిని నగరం విడిచి వెళ్ళేలా చేసిన సీఎం కేజ్రీవాల్ అంటూ ఆరోపించారు. 

"విద్యుత్-నీటి కనెక్షన్ కట్ చేయబడింది. నిద్రిస్తున్న ప్రజలను బస్సులలో ఎక్కించుకుని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌సరిహద్దుకు పంపించారు. ఆనంద్ విహార్‌లో, యూపీ-బీహార్‌కు బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటన చేయబ‌డింది. అయితే, యూపీ ప్రభుత్వం వలసదారుల కోసం బస్సులను ఏర్పాటు చేసింది. కార్మికులు, సంబంధిత బాధితుల‌ను సురక్షితంగా వెనక్కి తీసుకువ‌చ్చాం”అని యోగి ట్వీట్ చేశారు. 

“వినండి కేజ్రీవాల్, మీరు కరోనా బాధతో మొత్తం మానవాళి రోదిస్తున్నప్పుడు మీరు యూపీ కార్మికులను ఢిల్లీ వదిలి వెళ్ళమని బలవంతం చేసారు. మీ ప్రభుత్వం యూపీ సరిహద్దులో చిన్న పిల్లలను, మహిళలను కూడా నిస్సహాయంగా ఉంచడం వంటి అప్రజాస్వామిక, అమానవీయ చర్య చేసింది. మిమ్మల్ని దేశద్రోహి అని పిలుస్తారా లేదా..." అని ఆదిత్యనాథ్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

దీనికి కేజ్రీవాల్ కౌంట‌ర్ ఇస్తూ.. "వినండి యోగీ, మీరు అలా ఉండనివ్వండి. యూపీ ప్రజల మృతదేహాలు నదిలో ప్రవహిస్తున్న‌ప్పటికీ... కోట్లాది రూపాయలు ఖర్చు చేసి టైమ్స్ మ్యాగజైన్‌లో మీ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. . నీలాంటి క్రూరమైన పాలకుడిని నేను ఎప్పుడూ చూడలేదు" అని ట్వీట్ చేశారు. 


Scroll to load tweet…