అయోధ్య రామ మందిరం గురించి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఏషియానెట్‌కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన రామ మందిరం గర్భగుడిలో ఆవిష్కృతమయ్యే అద్భుత పరిణామాన్ని వివరించారు. ప్రతి రోజు మధ్యాహ్నం సూర్య కిరణాలు ఐదు నుంచి పది నిమిషాలు సూర్య కిరణాలు రాముడి గుడి నుదుటిపై పడతాయని తెలిపారు.
న్యూఢిల్లీ: ఉత్తప్రదేశ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ ఒక అద్భుతాన్ని భక్తులు చూడబోతున్నారు. ఔను.. రామ మందిరం.. గర్భగుడిలోనే ఆ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రతి రోజు ఐదు నుంచి పది నిమిషాల పాటు సూర్య రశ్మి గర్భగుడిలోకి ప్రవేశించి రాముడిని ప్రసన్నం చేయనుంది. ఆ సూర్య కిరణాలు రాముడి నుదుటిపై బొట్టులా ప్రకాశించనున్నట్టు రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఏషియానెట్ న్యూస్‌కు చెందిన రాజేశ్ కల్రాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘రాముడు రామ నవమి రోజున జన్మించారు. ఆయన బహుశా మధ్యాహ్నం 12 గంటలకు జన్మించి ఉంటాడనే విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి.. మేం ఏమనుకుంటున్నాం అంటే.. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఐదు నుంచి పది నిమిషాలు సూర్య కిరణాలు నేరుగా రాముడి విగ్రహంపై పడేలా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని నృపేంద్ర మిశ్రా వివరించారు.
ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే బాధ్యతను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు అప్పజెప్పినామని ఆయన తెలిపారు. అస్ట్రానమీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఈ కౌన్సిల్ నిపుణులు పూణెలో ఉంటారని, వారే దీని కోసం డిజైన్ చేశారని వివరించారు. వారు గుడి నిర్మాణాలకు సంబంధించి వివరాలను తీసుకెళ్లారని తెలిపారు. సౌర కుటుంబంలోని మార్పులు పరిగణనలోకి తీసుకుని సుమారు 19 ఏళ్లు నిరాటంకంగా మధ్యాహ్నం పూట గర్భగుడిలోని రాముడి విగ్రహంపై సూర్య కిరణాలు పడేలా వారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అప్పటి వరకు ఎలాంటి అడ్జస్ట్‌మెంట్లు లేకుండా ఈ కార్యం జరిగేలా చూస్తున్నారని తెలిపారు. ఇది చాలా గొప్ప కార్యం అని, చాలా బలమైన పని కూడా అని చెప్పారు.
పూర్తి ఇంటర్వ్యూ ని ఇక్కడ చూడండి...
"
అయితే, ఈ అద్భుతం పెద్ద బాధ్యతను కూడా ముందుకు తెస్తుందని ఆయన వివరించారు. ఈ అద్భుతాన్ని చూడటానికి పెద్ద మొత్తంలో జనం ఆలయ ప్రాంగణంలో గుమిగూడవచ్చని చెప్పారు. దీంతో భక్తుల నిర్వహణ సవాల్‌గా మారే ముప్పు ఉందని అన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఇతర చర్యలు తీసుకోబోతున్నట్టు నృపేంద్ర మిశ్రా తెలిపారు.
అందరూ ఈ అద్భుతాన్ని మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి చూడాలని అనుకోవడం సహజం అని, ఒక వేళ వారంతా ఆలయ ప్రాంగణానికి వస్తే తొక్కిసలాట ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఒక్క సారిగా 75 వేల నుంచి ఒక లక్ష మంది భక్తులు గుడికి వస్తేగనుక వారిని నిర్వహించడం సాధ్యం కాదని వివరించారు. కాబట్టి, ఆ గుంపును నివారించడానికి అయోధ్య వ్యాప్తంగా సుమారు 100 భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ స్క్రీన్లలో రాముడిపై సూర్య కిరణాలు నేరుగా పడే దృశ్యాలను చూపిస్తామని వివరించారు. తద్వార భక్తుల్లో కొంత ఉత్సుకతను నియంత్రణలో పెట్టడానికి ఈ స్క్రీన్లు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. తద్వార భక్తులను కంట్రోల్ చేయడం సులువు అవుతుందని చెప్పారు.
ప్రస్తుతం తమ అంచనాల ప్రకారం, పీక్ డేస్‌లలో రామాలయం 12 గంటలు తెరిచే ఉంచితే.. సుమారు 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు భక్తులు గుడికి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు అంటే.. ప్రతి వ్యక్తి ఏడు సెకండ్లలో దైవ దర్శనం చేసుకుని గుడి నుంచి బయటకు వెళ్లిపోతారని వివరించారు. ఈ సమయాన్ని, భక్తుల అనుభూతిని మరింత సుసంపన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
