Sunil Kanugolu: లోక్ సభ ఎన్నికలకూ సునీల్ కనుగోలుకు బాధ్యత.. కాంగ్రెస్ కీలక నిర్ణయం

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాలను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన సునీల్ కనుగోలుకు ఆ పార్టీ మరో బాధ్యత అప్పగించింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాన్ని, సోషల్ మీడియాలో ప్రచారాన్ని చూసుకునే బాధ్యతను ఆయనకే ఇచ్చినట్టు తెలిసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకూ ఆయనతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నట్టు సమాచారం.
 

sunil kanugolu to look after congress party campaign strategy and social media campaigns kms

నేడు ఎన్నికల్లో డబ్బుతోపాటు వ్యూహ రచన చాలా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం అనూహ్యంగా పెరిగిన తర్వాత.. అదే రీతిలో ఎలక్షన్ స్ట్రాటజీలు కూడా మారిపోయాయి. ఎన్నికల్లో ఇప్పుడు ప్రత్యక్షంగా పోటీ చేయడమే కాకుండా.. సోషల్ మీడియాలో ఫైట్ చేయడమూ ముఖ్యమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్తలకు డిమాండ్ పెరిగింది. వారి ట్రాక్ రికార్డు బట్టి డిమాండ్ ఉంటుంది. ప్రశాంత్ కిశోర్‌కు దేశవ్యాప్తంగా పేరుంది. కానీ, ఆయన తన ప్రొఫెషనల్ పనికి ఫుల్ స్టాప్ పెట్టి.. రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. ఇప్పుడు ఆయనతో కలిసి పని చేసిన సునిల్ కనుగోలు పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చడంతో సహజంగానే హస్తం పార్టీ ఆయనపై ఆశలు పెంచుకున్నది. అందుకే లోక్ సభ ఎన్నికలకూ ఆయనకు బాద్యతలు అప్పగించింది.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు పార్టీ క్యాంపెయిన్ స్ట్రాటజీ, సోషల్ మీడియా క్యాంపెయిన్స్  బాధ్యతలను అప్పగించినట్టు పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. 

కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కీలక పాత్ర పోషించిన సునీల్ కనుగోలుకు ఈ బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ ప్రచార వ్యూహం కోసం సునీల్ కనుగోలు ఓ వార్ రూమ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసింది. 

లోక్ సభ ఎన్నికలతోపాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకూ పార్టీ క్యాంపెయిన్ స్ట్రాటజీ బాధ్యతలను సునీల్‌కు కాంగ్రెస్ అప్పగించింది.

Also Read: Republic Day: ముఖ్య అతిథిగా రావడానికి బైడెన్ నిరాకరణ.. కారణాలివేనా?

ఇటీవలే సునీల్ కనుగోలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ కమ్యూనికేషన్ టీమ్ సభ్యులతో సమావేశం అయ్యాడు. ఇటీవలే రెండు సార్లు ఆయన కాంగ్రెస్ వార్ రూమ్‌కు వెళ్లి వచ్చాడు. 

కాంగ్రెస్ శిబిరానికి రావడానికి ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీ నేతలతో పలుమార్లు సమావేశం అయ్యాడు. ఆయన  బీఆర్ఎస్‌కే ప్రచారం చేస్తారనే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ వైపు వచ్చారు. వెంటనే ఆయనను కాంగ్రెస్ ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా నియమించింది.

గతేడాది మే నుంచి ఆయన కాంగ్రెస్‌తో ఉన్నాడు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ ఆయన పని చేశాడు. 2014లో విడిపోవడానికి ముందు ప్రశాంత్ కిశోర్‌తో పని చేశాడు. యూపీలోనూ పని చేసి 2017లో యోగి ఆదిత్యానాథ్ విజయానికి కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కార్యరూపం దాల్చడంలోనూ సునీల్ పాత్ర ఉన్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios