ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా సునీల్‌ అరోరా నియమితులయ్యారు. సునీల్ అరోరాను సీఈసీగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఈసీగా ఉన్న ఓపీ రావత్‌ పదవీకాలం డిసెంబరు 2న ముగియనుంది. 

ఓపీ రావత్ పదవీకాలం ముగిసిన రోజునే అంటే డిసెంబర్ 2నే సునీల్‌ అరోరా బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన అరోరా గతేడాది సెప్టెంబర్‌ మాసంలో ఎన్నికల సంఘం అధికారిగా నియమితులయ్యారు. గతంలో ఆయన సమాచార, ప్రసారాల శాఖ, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు. 

సునీల్ అరోరా 1980 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. గతంలో ఆయన ఆర్థికమంత్రిత్వ శాఖ, టెక్స్‌టైల్‌, ప్రణాళికా కమిషన్‌ శాఖల్లోనూ పనిచేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా 1999- 2000 మధ్య కాలంలో పనిచేశారు. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సీఎండీగానూ సేవలందించారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమినర్ గా నియమితులయ్యారు.