బెంగళూరు: అలనాటి హీరోయిన్, కన్నడ రెబల్‌స్టార్‌ దివంగత అంబరీష్‌ భార్య సుమలత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆదివారం మాండ్యాలో జరిగిన అంబరీష్‌ సంస్మరణ సభలో ఈ ఆమె రాజకీయాల్లోకి వచ్చే ప్రస్తావన వచ్చింది. 

అంబరీష్‌ సొంత జిల్లా మాండ్యాలో జరిగిన సభకు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన సినీ హీరో దర్శన్‌, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, సీనియర్‌ నటుడు దొడ్డణ్ణలు ఈ సభలో మాట్లాడారు. 

సుమలత ఎన్నికల్లో పోటీ చేయాలని వారంతా ప్రతిపాదించారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకుంటే జేడీఎస్ లో చేరాలని, సాధ్యం కాదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  చేయాలని కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. 

తామంతా కలిసి సుమలత విజయానికి కృషి చేస్తామని అంబరీష్ ప్రతిజ్ఞ చేశారు. ఆమె కుమారుడు, సినీ హీరో అభిషేక్‌ సైతం అమ్మ ఎన్నికల్లో పోటీ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. 

ఆ వేదికపై ఉన్న సుమలత వారి మాటలను కొట్టిపారేయలేదు. దీంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించడం ఖాయమనే మాట వినిపిస్తోంది.