అలనాటి సినీ తార సుమలత.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా.. ఇప్పుడు ఆ వార్తే నిజమైంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో  కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయడం కన్ఫామ్ అని తేలింది.

మండ్య లోక్ సభ నియోజకవర్గం ప్రజల  ఒత్తిడి మేరకు సుమలత అంబరీష్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ నియోజకవర్గం నుంచి హీరోయిన్ రమ్య పోటీ చేశారు. సుమలత ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే చాలెంజింగ్ స్టార్ దర్శన్ తోపాటు కన్నడ చలన చిత్ర పరిశ్రమ సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఆమె  రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చాలా మంది ఒత్తిడి చేశారట. అందుకే ఆమె కూడా పోటీకి అంగీకరించారు. ఈ విషయంపై ఫిబ్రవరి 11వ తేదీన అధికారిక ప్రకటన చేయనున్నారు. 

ఇదిలా ఉంటే..ఇదే నియోజకవర్గం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రియ కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మండ్య నియోజక వర్గంలో జేడీఎస్ కు మంచి పట్టు ఉంది. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కచ్చితంగా పోటీ చేస్తారని జేడీఎస్ నాయకులు అంటున్నారు. 

అయితే.. కాంగ్రెస్-జేడీఎస్ ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి కాబట్టి.. సుమలత టికెట్ కాన్ఫామ్ అయితే.. సీఎం కుమారుడు పక్కకు జరగాల్సిందే అని పలువురు భావిస్తున్నారు. మరో నాలుగైదు రోజులు ఆగితేగానీ ఈ విషయంలో క్లారిటీ రాదు.