ఎవరెన్ని విమర్శలు చేసినా.. వూరి పేర్లను మారుస్తూ పోతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో నగరం పేరును మార్చేందుకు సిద్ధమయ్యారు. చారిత్రక నగరంగా పేరొందిన సుల్తాన్‌పూర్‌ను కుష్‌భావన్‌పూర్‌గా మార్చాలని గవర్నర్ రామ్‌నాయక్... యోగికి లేఖ రాశారు.

నగరం పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ మేధావులు, ప్రతినిధులు తనతో భేటీ అయ్యారని.. వారు సమర్పించిన మెమోరాండం సుల్తాన్‌పూర్ చరిత్రను తెలిపే ఓ పుస్తకాన్ని కూడా గవర్నర్‌.. ముఖ్యమంత్రికి అందించారు.

కుష్‌‌భావన్‌పూర్‌ను చారిత్రక నగరంగా గుర్తించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారని రామ్‌నాయక్ తెలిపారు. కాగా, అంతకు ముందే సుల్తాన్‌పూర్ పేరు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా మార్చిన సంగతి తెలిసిందే.