Asianet News TeluguAsianet News Telugu

రైతుల ఆందోళన: కేంద్ర మాజీ మంత్రి, ‘శిరోమణి’ చీఫ్‌లు అరెస్టు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలకు నేటితో ఏడాది గడుస్తున్న సందర్భంగా పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ పార్టీ ఢిల్లీలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీ నిర్వహిస్తున్న శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

sukhbir singh, harsimrat kaur arrested over farm protest
Author
New Delhi, First Published Sep 17, 2021, 2:36 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను తెచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీ ఈ రోజును బ్లాక్‌ డేగా ప్రకటించింది. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఓ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. రైతులు, మద్దతుదారులు పెద్దమొత్తంలో ఈ ర్యాలీకి హాజరయ్యారు. పోలీసులూ బారికేడ్లు, ట్రాఫిక్ మార్పు చేర్పులతో రంగంలోకి దిగారు. నిరసనకారులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు సారథ్యం వహిస్తున్న శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌లతోపాటు మరో 11 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలోని గురుద్వారా తలాబ్ గంజ్ సాహిబ్ నుంచి పార్లమెంటుకు వరకు ర్యాలీ తీస్తామని ఇటీవలే శిరోమణి అకాలీ దళ్ ప్రకటించింది. ఇందులో రైతులు, రైతు మద్దతుదారులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. పంజాబ్ నుంచీ పెద్దమొత్తంలో ఢిల్లీకి చేరుకుని ఇందులో పాల్గొనాలని సూచించింది.

ఈ మార్చ్ కారణంగా ఢిల్లీలోని లూట్యెన్స్, ఐటీవో, ఇతర చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. చాలా చోట్లా పోలీసులు బారికేడ్లు రోడ్లకు అడ్డుగా పెట్టి మోహరించారు. ఈ నేపథ్యంలోనే రైతు ఆందోళనలో పాల్గొన్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్, హర్‌సిమ్రత్ కౌర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios