కవిత, కేటీఆర్‌లపై వ్యాఖ్యలు.. నాకు కొందరి బెదిరింపు : సుఖేష్ మరో లేఖ , సీబీఐ విచారణకు డిమాండ్
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలోని జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను వదిలారు. లీగల్ నోటీసులతో మంత్రి కేటీఆర్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చంద్రశేఖర్ ఆరోపించారు.

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలోని జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను వదిలారు. కవిత, కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కొందరు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విచారణ జరిగితే అసలు విషయాలు బయటికొస్తాయని భయపడుతున్నారని సుఖేష్ దుయ్యబట్టారు. లీగల్ నోటీసులతో మంత్రి కేటీఆర్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో తన ఆరోపణలపై సీబీఐ విచారణ నిర్వహించాలని సుఖేష్ కోరారు.
కాగా.. తనపై, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన ఆరోపణలను తీవ్రంగా తోసిపుచ్చుతూ సుఖేష్ చంద్రశేఖర్‌కు జూలై 14 లీగల్ నోటీసు పంపారు కేటీఆర్. కేటీఆర్, కవిత, తనకు మధ్య జరిగిన రూ.2 వేల కోట్ల లావాదేవీల డేటాతో పాటు కాల్ రికార్డింగ్స్, చాటింగ్ తదితర ఆరోపణలకు సంబంధించి డేటా తన వద్ద ఉందని సుఖేష్ పేర్కొన్నారు. ఫోర్జరీ, దోపిడీ, మనీలాండరింగ్ వంటి ముప్పైకి పైగా హై ప్రొఫైల్ కేసుల్లో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు. తన న్యాయవాది ద్వారా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చంద్రశేఖర్ కు లీగల్ నోటీసు పంపారు కేటీఆర్.
ALso Read: సుఖేష్ చంద్రశేఖర్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీకి, ఆప్ నేతలకు ఇచ్చిన వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలను ఉపసంహరించుకోవడానికి బదులుగా కేటీఆర్, కవిత సన్నిహితులు తనకు రూ.100 కోట్లు, శంషాబాద్ లో భూమి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టు ఆఫర్ చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీబీఐ డైరెక్టర్లకు జూలై 12 రాసిన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపించారు.
వారి షరతులకు అంగీకరించకపోతే మరింత దారుణమైన పరిస్థితి వస్తుందని తనను బెదిరించారని సుఖేష్ ఆరోపించారు. కేటీఆర్, కవిత, తన మధ్య జరిగిన రూ.2000 కోట్ల లావాదేవీలకు సంబంధించిన డేటాతో పాటు 250 జీబీ సైజులో ముగ్గురి మధ్య కాల్ రికార్డింగ్స్, చాట్స్ తన వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన కేటీఆర్.. అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేసిన సుఖేష్ చంద్రశేఖర్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.