ఆల్వార్: రాజస్థాన్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఓ సబ్ ఇన్ స్పెక్టర్ పోలీసు స్టేషన్ లోనే మహిళపై మూడు రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన 45 ఏళ్ల వయస్సు గల మహిళపై అతను అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 

అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని మహిళ 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ వివాదం సమసిపోయింది. తాజాగా మహిళ భర్త విడాకులకు సిద్ధపడ్డాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. దాంతో మహిళ ఈ నెల 2వ తేదీన పోలీసు స్టేషన్ కు వెళ్లి ఎస్సైని కలిసినట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. ఎస్సైని పోలీసులు అరెస్టు చేశారు.

తనపై మధ్య వయస్కుడైన ఎస్సై మార్చి 2వ తేదీ నుంచి అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఆమె ఆదివారంనాడు ఫిర్యాదు చేసింది. విషయం బయటకు వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని, నిందితుడు సింగ్ ను అరెస్టు చేశామని ఆల్వార్ ఎస్పీ చెప్పారు. ఎస్సైకి, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డును మహిళ అందించినట్లు తెలిపారు 

నిందితుడిని సస్పెండ్ చేసి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఐడి నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఎస్పీ చెప్పారు. బాధిత మహిళ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.