అప్పుడే పుట్టిన ఆడ శిశువుని గోనె సంచిలో పెట్టి.. రోడ్డు పక్కన పడేశారు. ఒక దాంట్లో మరొకటి ఇలా మూడు గోనెసంచుల్లో ఆడ శిశువుని పెట్టారు. కాగా.. చలికి చనిపోతుందిలే అనుకొని అలా ఊపిరాడకుండా ఉండేందుకు గోనె సంచికి ముడి వేశారు. అయితే.. ఆ శిశువు ప్రాణాలతో బతికి బయటపడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గోనె సంచిలో పడేసి వెళ్లిపోయారు. కాగా.. ఆ గోనె సంచిలో నుంచి శిశువు ఏడస్తుండటం వినపడింది. దీంతో.. అది విన్న స్థానికులు వెంటనే ఆ సంచి ఓపెన్ చేసి చూశారు. దాంట్లో చిన్నారి ఉండటం గమనార్హం.

చిన్నారి ఇంకా బతికే ఉందని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా.. అప్పుడే పుట్టిన చిన్నారిని ఎలా వదిలేశారు.. వాళ్లసలు తల్లిదండ్రులేనా అని ఓ మహిళ అనడం ఆ వీడియోలో స్పష్టంగా వినపడటం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

చిన్నారి ఆరోగ్యంగానే ఉందని.. అవసరమైన  చికిత్స  అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆడపిల్ల కావడంతోనే వదిలేశారని పలువురు భావిస్తున్నారు. కాగా.. ప్రతి సంవత్సరం  ఇలా ఆడపిల్లలను వదిలేసేవారు చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కాగా.. జెండర్ ఈక్వాలిటీ పేరిట ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఆడపిల్ల పుట్టిందని ఇలా వదిలేయడం బాధాకరమని పోలీసులు తెలిపారు.