తాగిన మైకంలో ఇద్దరు బీకాం విద్యార్థులు ఆత్మహత్య చేసుకోబోయిన సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...జలహళ్లి ప్రాంతంలోని సెయింట్ క్లారెట్ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి బయటకు వెళ్లి వచ్చారు. 

బయట పీకల దాకా మద్యం తాగి వచ్చిన ఇద్దరు విద్యార్థులు ఆ మందు మత్తులో కళాశాలలో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించి సంచలనం రేపారు. మద్యం తాగి కళాశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను కౌన్సెలింగ్ కోసం పిలవాలని ఆదేశించగా ఓ విద్యార్థి తరగతి గదిలోనుంచి తన బ్యాగు తీసుకొని రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. 

ఈ ఘటనలో గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. కళాశాల బయట ఉన్న పలు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లలో విద్యార్థులు మద్యం తాగుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో విద్యార్థులను హెచ్చరించిన కళాశాల ప్రిన్సిపాల్ ఇకనుంచి భోజనం కోసం విద్యార్థులను బయటకు వెళ్లేందుకు అనుమతించమని ప్రకటించారు.