విద్యార్థుల మద్య సరదాగా మొదలైన గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. క్లాస్ రూంలో ఇద్దరు విద్యార్థులు డబ్యూడబ్యూఎఫ్ లో మాదిరిగా కొట్టుకోవడంలో పోటీకి దిగి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోయంబత్తూరులోని ఫాతిమా స్కూల్లో పదో తరగతి విద్యార్థులు లంచ్ టైంలో సరదాగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ బలమైన విద్యార్థి కాస్త బలహీనంగా ఉన్న విద్యార్థితో గొడవకు దిగాడు. అయితే బలహీనంగా ఉన్న విద్యార్థి టేబుల్ పైకి ఎక్కి బలంగా ఉన్న విద్యార్థిపైకి దూకాడు. అయితే అతన్ని అమాంతం గాల్లోనే పట్టుకున్న విద్యార్థి  నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో  ఆ విద్యార్థి ఆచేతనంగా పడిపోయాడు. దీంతో మిగతా విద్యార్థులంతా కలిసి కిందపడిన విద్యార్థిని ఉపాధ్యాయుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ విద్యార్థి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ వార్త తెలిసి భయపడిపోయిన మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల కు దగ్గర్లోని బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.