కేరళ యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థికి కొశ్చన్ పేపర్‌కు బదులు ఆన్సర్ కీ షీట్ ఇచ్చారు. ఆ విద్యార్థి గమ్మున కూర్చుని ఆ ఆన్సర్  కీ షీట్‌తోపాటు సమాధానాలు రాసి ఇన్విజిలేటర్‌ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. తీరా ఆ సెట్‌ను మూల్యాంకనం చేయడానికి తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. 

తిరువనంతపురం: కరోనా వైరస్ సోకడంతో ఆ విద్యార్థి గతంలో నిర్వహించిన ఓ పరీక్షకు హాజరు కాలేకపోయాడు. రీ ఎగ్జామినేషన్ కోసం ఆ విద్యార్థి ఫిబ్రవరిలో మళ్లీ ఎగ్జామ్ సెంటర్‌లో అడుగు పెట్టాడు. అందరిలాగే.. ఆ విద్యార్థి కూడా కొంచెం బెరుకుగానే పరీక్షా కేంద్రంలో అటూ ఇటూ చూపులు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఇన్విజిలేటర్ వచ్చి సమాధానాలు రాసే ఆన్సర్ షీట్ అందించాడు. ఆ తర్వాత అందించే కొశ్చన్ పేపర్ మాత్రం చేయికి ఇవ్వలేదు. దానికి బదులుగా ఆన్సర్ కీ షీట్ ఇచ్చాడు. దీంతో ఆ విద్యార్థి గమ్మున ఆ ఆన్సర్ కీ చూస్తూ.. ఆన్సర్ షీట్‌లో బబుల్స్ నింపాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇంతకీ ఈ విషయం ఎప్పుడు ఎలా వెలుగు చూసిందో తెలుసా?

కేరళ యూనివర్సిటటీ విద్యార్థి బీఎస్సీ చదువుతున్నాడు. ఆయన తన ఎలక్ట్రానిక్స్ పేపర్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే పరీక్ష కరోనా సోకడం వల్ల రాయలేకపోయాడు. ఆ పరీక్షను యూనివర్సిటీలో ఫిబ్రవరిలో మళ్లీ నిర్వహించింది. ఆ పరీక్ష రాయడానికి విద్యార్థి ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాడు. కానీ, ఆ విద్యార్థికి కొశ్చన్ పేపర్‌కు బదులు ఆ కొశ్చన్స్‌కు సమాధానం తెలిపే కీ పేపర్ ఇచ్చాడు. అందులో అన్ని సమాధానాలను వెల్లడించే బబుల్స్ ఉన్నాయి. ఆ విద్యార్థి తాను పొందిన ఆన్సర్ కీ షీట్‌ను చూస్తూ సమాధానాలు రాసి గమ్మున ఇన్విజిలేటర్లో వాటిని పెట్టి బయటకు వెళ్లిపోయాడు. తీరా ఆ సెట్‌ ఎవాల్యూయేటర్ దగ్గరకు వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడింది.

ఆ ఎవాల్యూయేటర్ ఆ సమాధానాలను మూల్యాంకనం చేయడానికి యూనివర్సిటీ నుంచి కొశ్చన్ పేపర్ కావాలని అడిగాడు. దీంతో యూనివర్సిటీ అధికారులు జరిగిన పొరపాటును గుర్తించారు. వెంటనే ఆ పరీక్షను రద్దు చేశారు. మళ్లీ మే 3వ తేదీన ఆ పరీక్ష నిర్వహించడానికి రీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ప్రకటించింది.

విద్యార్థికి ఆన్సర్ కీ షీట్ ఇచ్చిన ఇన్విజిలేటర్ కూడా జరిగిన పొరపాటును చూడలేదా? లేక తెలిసే ఆయన ఆ విద్యార్థికి సమాధానపత్రాన్ని ఇచ్చాడా? అనే అనుమానాలు వచ్చాయి. దీంతో ఆ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ దర్యాప్తునకు ఆదేశించారు.