రాజస్థాన్‌లో దారుణం జరిగింది. స్కూల్ నుంచి తనను బహిష్కరించాడన్న కక్షతో ఒక విద్యార్ది టీచర్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు
స్కూల్ నుంచి తనను బహిష్కరించాడన్న కక్షతో ఒక విద్యార్ది టీచర్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లో ఝాలావర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 16 ఏళ్ల నిందితుడైన విద్యార్ధి పాఠశాలలో అల్లరి పనులు చేయడంతో పాటు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడు శివచరణ్ (54) పలుమార్లు అతనిని మందలించాడు. అయినప్పటికీ నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇదే సమయంలో పాఠశాలలో ఓ విద్యార్ధినితో అతను ప్రేమలో పడినట్లుగా మేనేజ్‌మెంట్‌కు తెలిసింది. దీంతో నిందితుడిని స్కూల్ నుంచి బహిష్కరించారు.
అయితే తన బహిష్కరణకు కారణమైన టీచర్ శివచరణ్‌పై నిందితుడు పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతనిని చంపాలని నిర్ణయించుకుని కుట్ర పన్నాడు. దీనిలో భాగంగా ఈ మంగళవారం స్కూల్‌లో విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న శివచరణ్‌ను మరో ఇద్దరు మిత్రులతో కలిసి అడ్డుకున్నాడు. ఆపై కత్తితో టీచర్‌ను విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆయన రోడ్డుపై కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శివచరణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక కత్తి, సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడి హత్యతో ఆయన పనిచేస్తున్న స్కూల్‌లోని తోటి టీచర్లు, సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
