బైక్ మీద వెళ్తుంటే లిఫ్ట్ అడిగాడు.. లిఫ్టే కదా అని వెంటనే ఇచ్చేశాడు. అయితే... లిఫ్ట్ ఇచ్చినందుకు పెట్రోల్ కి డబ్బులు అడిగాడు. ఇవ్వలేదని కోపంతో చంపేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కలసపాక్కం ప్రాంతానికి చెందిన శంకర్(43) చెన్నై కోలత్తూరులో భవన నిర్మాణ పనులు చేస్తుండేవాడు. ఈ నెల 4వ తేదీన కొలత్తూరు వలర్మతినగర్ లో తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సంఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాను పరిశీలించగా కొలత్తూరు అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన శశికుమార్‌ బైక్‌పై వస్తుండగా శంకర్‌ లిఫ్ట్‌ కోరినట్లు తెలిసింది. దీని ఆధారంగా విచారణ జరపగా శంకర్‌ లిఫ్ట్‌ కోరినందున శశికుమార్‌ అతన్ని పెట్రోలుకు నగదు అడిగినట్లు, అతను ఇవ్వనందున హతమార్చినట్లు తెలిసింది. దీంతో శశికుమార్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా... నిందితుడు స్టూడెంట్ గా గుర్తించారు.