మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టిందన్న కోపంతో ఓ వ్యక్తి 23ఏళ్ల యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపైనే ఈ దారుణ హత్య జరిగింది.

మధ్యప్రదేశ్ సియోనీ జిల్లాలోని ఒకే గ్రామంలో మృతురాలు, నిందితులు నివసించేవారు. అయితే ఈ యువతిపై నిందితుడు అనిల్ మిశ్రా(35) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పలుమార్లు హెచ్చరించినా మిశ్రా తీరు మారకపోవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనిల్ మిశ్రాను గట్టిగా హెచ్చరించి వదిలేశారు. అయితే తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు యువతిపై కోపాన్ని పెంచుకున్న నిందితుడు హత్యకు పథకం పన్నాడు.

యువతిని కాలేజీకి వెళ్లే సమయంలో అడ్డగించిన అనిల్ ఆమెను జుట్టు పట్టుకుని నడి రోడ్డుపై పడేశాడు. అనంతరం రోడ్డు పక్కన వున్న ఓ బండరాయితో యువతి తలపై మోదాడు. అయితే దీన్ని గమనించిన కొందరు అటువైపు వస్తుండటం చూసి అనిల్ పరారయ్యాడు. 

రక్తపు మడుగులో కొన ఊపిరితో పడివున్న యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె హాస్పిటల్లో ప్రాణాలు వదిలింది. 

ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అనిల్ మిశ్రా ఇంకా పరారీలో ఉన్నట్లు అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.