జట్టు కత్తిరించుకోమని మందలించినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక అరుంబాక్కం వినాయకపురంకు చెందిన సంజయ్‌కుమార్‌ (15) మదురవాయల్‌లో ఉన్న ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌ టూ చదువుతున్నాడు. మంగళవారం ఇంటి నుంచి ఉత్సాహంతో పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటకు ఇంటికి వచ్చిన సంజయ్‌కుమార్‌ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఎంతసేపటికి బయటకు రాలేదు. అనుమానించిన తల్లిదండ్రులు తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లగా, అతను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం చూసి బోరున విలపించారు.

సమాచారం అందుకున్న చూలైమేడు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. విచారణలో, సంజయ్‌కుమార్‌ జుట్టు ఎత్తుగా పెంచుకోవడంతో దానిని కత్తిరించుకొని పాఠశాలకు రావాలని ఉపాధ్యాయుడు మందలించాడని, అందువల్ల మనస్తాపానికి గురైన సంజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినత్లి తెలిసింది. కాగా, సంజయ్‌కుమార్‌ సహచర విద్యార్థినిని ప్రేమిస్తున్నట్టు, అతని ప్రేమను ఆమె అంగీకరించకపోవడంతో అతను ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని మరో కారణంగా పోలీసులు భావిస్తున్నారు.