Sharad Pawar:  మ‌హారాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం సృష్టించాల‌ని కేంద్రం ప్ర‌య‌త్నిస్తోందనీ, ఎంవీఏ ప్రభుత్వం నుంచి అధికారాన్ని లాక్కోవాలని తహతహలాడుతోంద‌ని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) చీఫ్‌ శరద్‌ పవార్  ఆరోపించారు. కేంద్రం త‌న చేతుల్లో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. మ‌హారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తుంద‌ని శరద్ పవార్ విమ‌ర్శించారు.   

Sharad Pawar: సమ్మె చేస్తున్న మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (MSRTC) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఎంవీఏ(MVA government) ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే.. ఆ స‌మ్మెకు నాయకత్వం వహిస్తున్న వారిని కొందరు తప్పుదారి పట్టించి, రెచ్చగొడుతున్నారని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) చీఫ్‌ శరద్‌ పవార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆదివారం తూర్పు మహారాష్ట్రలోని అమరావతిలో ఎన్‌సిపి కార్యకర్తల ర్యాలీలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎంవిఎ ప్రభుత్వం నుండి అధికారాన్ని లాక్కోవాలని ప్ర‌తిప‌క్షాలు తహతహలాడుతున్నాయ‌ని, ఇందుకోసం కేంద్రం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంద‌నీ, 

త‌ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్ర రవాణా కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోందనీ, కానీ వారి నాయకత్వం తప్పు చేతుల్లోకి వెళ్లిందని, కొంతమంది ఎస్టీ కార్మికులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నార‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ముంబ‌యిలోని త‌న ఇంటిపై జ‌రిగిన దాడిని ప్ర‌స్త‌వించారు. దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకూడదని పవార్ అన్నారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం.. దేశంలో మత విద్వేషం, శత్రుత్వంతో కూడిన రాజకీయాలు చేస్తోందని పవార్ ఆరోపించారు. హిందువులు- ముస్లింలు, దళితులు- దళితేతరుల మధ్య చీలికలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ. మనం దీనిని గ్ర‌హించాల‌ని పవార్ అన్నారు.

రాష్ట్రంలో అధికారం ఎంవీఏ చేతిలో ఉన్నప్పటికీ పరిస్థితి అంత తేలిక లేద‌నీ, అధికారానికి దూరంగా ఉన్నవారు దానిని లాక్కోవాలని తహతహలాడుతున్నారనీ, కేంద్ర ప్ర‌భుత్వం త‌న‌ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్సీపీ చీఫ్ పేర్కొన్నారు. MVA నాయకులపై వివిధ ఆరోపణలు చేస్తున్నారని, MVA యొక్క ఇద్దరు మంత్రులు- అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్ లను కేంద్ర ఏజెన్సీలు అరెస్టు చేశార‌ని తెలిపారు. 

గ‌త శుక్రవారం.. MSRTC ఉద్యోగులు త‌న సంస్థ‌ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ముంబైలోని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఇంటి ముందు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌నలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల్లో కొందరు ఆగ్రహం పట్టలేక శరద్‌ పవర్‌ ఇంటిపై రాళ్లు, చెప్పులు, బూట్లు విసిరారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో శరద్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భద్రత బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ఈ ఘటనలో 110 మంది MSRTC కార్యకర్తలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 87 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. నిందితుల మొబైల్ ఫోన్లలో కొన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నామని, వాటిని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. మొత్తం 110 మంది నిందితులను పోలీసు వ్యాన్లలో సిఎస్టి రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ప్లానేడ్ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ దాడికి ప్రేరేపించార‌నే ఆరోపణలపై న్యాయవాది గుణరత్న సదావర్తేను సహా మొత్తం 110 మంది నిందితులను శనివారం కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో 109 మందిని 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపగా, సదావర్తేను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించినట్టు తెలిపారు.