శుద్ది చేసిన హుస్సేన్ సాగర్ నీటిని నిమ్మ సోడా తయారు చేసే వ్యక్తులకు జీహెచ్ఎంసీ సిబ్బంది విక్రయిస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం ఓ వీడియో హల్ చల్ చేసింది. ముంబైలో అచ్చం అలాంటి సంఘటన ఒకటి సంచలనం కలిగిస్తోంది.

ఓ ఇడ్లీ వ్యాపారి చట్నీలో నీళ్లు కలిపేందుకు బాత్రూంలో నీళ్లు పట్టుకుని రావడం కడుపులో వికారాన్ని కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి... బోరివాలీ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఇడ్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అతను చట్నీలో నీళ్లు కలిపేందుకు గాను రైల్వేస్టేషన్‌లోని మరుగుదొడ్లో కులాయి నీటిని నింపాడు..దీనిని కొందరు దూరం నుంచి వీడియో తీశాడు. ఇది గమనించిన సదరు వ్యక్తి నీళ్లు పారబోసి ఖాళీ డబ్బాను తీసుకుని తన బండి వద్దకు చేరుకున్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆహారణ నియంత్రణ శాఖ అధికారుల దృష్టికి చేరింది. దీనిపై వారు స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై  విచారణ చేపడతామని.. అలాగే ఇక నుంచి చిరు వ్యాపారులపైనా నిఘా పెడతామన్నారు. ఇటువంటి నీటిని వినియోగించడం అనారోగ్యకరమన్నారు.