రాజస్తాన్ జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య హింసాత్మక అల్లర్లు జరిగాయి. సోమవారం రాత్రే జలోరి గేట్ ఏరియాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసు బలగాలు చెదరగొట్టాయి. కాగా, ఈ రోజు కూడా మరోసారి హింసాత్మక ఘర్షణలు జరిగాయి. సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. పోలీసులపైకీ రాళ్లు రువ్వారు. బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ముందరి వాహనాలకు నిప్పు పెట్టారు. 

జైపూర్: రాజస్తాన్‌లో మళ్లీ అల్లర్లు జరిగాయి. రంజాన్ సందర్భంగా జలోరి గేట్ ఏరియాలో ఇరువర్గాలు తమ తమ విశ్వాసాలకు ప్రాతినిధ్యంగా ఉన్న జెండాలను ఎగరేయడం ఉద్రిక్తతలకు దారి తీశాయి. సోమవారం రాత్రే ఇక్కడ హింసాత్మకంగా ఘర్షణలు జరిగాయి. ఇంతటితో ఆగకుండా ఈ రోజు కూడా మరోసారి అల్లర్లు చోటుచేసుకున్నాయి. వీరిని ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా వారిపైనే మూకలు రాళ్లు విసిరాయి. ఆ తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. లాఠీ చార్జ్ చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఈ అల్లర్లు చేస్తున్న సందర్భంలో సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సూర్యకాంత వ్యాస్ నివాసం బయట నిలిపి ఉంచి వాహనాలకు నిప్పు పెట్టారు.

మొత్తం ఐదు ప్రాంతాల్లో మంగళవారం రాళ్లు రువ్విన ఘటనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసు ఫోర్స్ ఈ ప్రాంతాల్లో పరిస్థితులను అదుపులోకి తెచ్చాయి. వదంతులను ఆపడానికి జోధ్‌పూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. పలు చోట్ల పోలీసుల భద్రత నీడలోనే ఈద్ నమాజ్‌ను చేశారు.

జోధ్‌పూర్‌లో మూడు రోజుల పరశురామ్ జయంతి ఉత్సవాలు చేపడుతున్నారు. ఈ సమయంలోనే ఈద్ వచ్చింది. దీంతో ముందుగానే ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జలోరి గేట్ ఏరియా వద్ద ఈ రెండు వర్గాలు తమ తమ జెండాలు పెట్టారు. బ్యానర్లూ కట్టారు. ఇవే ఒకరిపై మరొకరిని ప్రేరేపించినట్టుగా చేశాయి. అనంతరం ఓ వర్గం మరో వర్గానికి చెందిన జెండా పీకేశారు. దీంతో ఒక్కసారిగా అల్లర్లు భగ్గుమన్నాయి. 

Scroll to load tweet…

సోమవారం రాత్రి కూడా మూకను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించాల్సి వచ్చింది. ఆ మూక స్థానిక పోలీసు పోస్టునూ ధ్వంసం చేశారు. జిల్లా అధికారులు ముందు జాగ్రత్తగా నిన్న రాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. కానీ, ఈ రోజు మళ్లీ అల్లర్లు జరిగాయి. రాళ్లు రువ్విన ఘటనలో మంగళవారం ఉదయం సుమారు నలుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల వాహనాలకూ నిప్పు పెట్టారు. 

పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంయమనం పాటించాలని ఇరువర్గాలను కోరారు. ప్రజలు సోదరభావాన్ని చాటాలని, ఇరువర్గాలు పరస్పరం సంయమనం పాటించి ఎవరి ఉత్సవాలు వారు జరుపుకోవాలని ట్వీట్ చేశారు. ఈ ఘటనలపై ఉన్నతస్థాయిలో విచారణ చేపడుతామని వివరించారు.