హైదరాబాద్: సున్నితమైన మనస్తత్వం కలిగి ఉన్నవాళ్లకు రాజకీయాలు పడవని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన తమిళ నటులు రజినీకాంత్, కమల్ హాసన్ లకు సలహా ఇచ్చారు. 

ప్రముఖ తమిళ పత్రిక ఆనంద వికటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి వారికి ఆ సలహా ఇచ్చారు. మంచి చేయాలనే ఉద్దేశంతో తాను సినిమా కెరీర్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించానని ఆయన చెప్పారు. 

రాజకీయాలు డబ్బులతోనే నడుస్తున్నాయని ఆయన అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తనను తన సొంత నియోజకవర్గంలో ఓడించారని, ఇటీవలి ఎన్నికల్లో తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు కూడా అదే పరిస్థితి ఎదురైందని ఆయన చెప్పారు. 

రాజకీయాల్లో ఉంటే ఓటమిని, అసంతృప్తిని, అవమానాలను భరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ విభిన్నంగా ఎదిగారని, రాజకీయాల్లో కొనసాగాలంటే వారు సవాళ్లలను, అసంతృప్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, వారు ఎదుర్కునే శక్కి వారికి ఉండవచ్చునని ఆయన అన్నారు. 

ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని భావించానని, కమల్ హాసన్ అసలు పోటీ చేయలేదని, ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలువలేదని చిరంజీవి గుర్తు చేశారు .రజినీకాంత్ అసలు పార్టీనే ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు.