అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహన్ని బుధవారం నాడు ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

 

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా దీనికి గుర్తింపు వచ్చింది. 33 నెలల్లో ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు.  దేశ వ్యాప్తంగా ఇనుమును కూడ ఈ విగ్రహ నిర్మాణం కోసం సేకరించారు. 

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఈ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.  ఈ విగ్రహం  ఏర్పాటు కోసం   రూ.2989 కోట్లను ఖర్చు చేశారు.  ఐక్యతకు చిహ్నంగా  ఈ విగ్రహన్ని ఏర్పాటు చేశారు. 

పటేల్ విగ్రహ నిర్మాణం కోసం 1700 టన్నుల కాంస్యం, 1,80,000 క్యూబిక్‌ మీటర్ల సిమెంటు, 18,500 టన్నుల స్టీల్‌ కాంక్రీట్‌ను ఉపయోగించారు. దీనికి తోడుగా 6500 టన్నుల ఇనుమును కూడ వినియోగించారు.

5.6 అడుగుల ఎత్తున్న వంద మంది మనుషులు ఒకరిపై ఒకరు  నిలిస్తే ఎంత ఎత్తుంటారో... ఈ విగ్రహం అంత ఎత్తుంటుంది. విగ్రహం ఛాతీ వరకు రెండు లిఫ్టుల్లో సందర్శకులు  వెళ్లే అవకాశం ఉంది.  ఇక్కడ ఒకేసారి 200 మంది నిలబడేలా ఏర్పాట్లు చేశారు. 

గంటకు 180 కి.మీ వేగంతో గాలులు వచ్చినా కూడ ఈ విగ్రహనికి  ఎలాంటి నష్టం ఉండదు. 6.5 తీవ్రతతో భూకంపాలు వచ్చినా కూడ ఈ విగ్రహం కొంచెం కూడ దెబ్బతినదు. పటేల్‌కు చెందిన మూడు వేల ఫోటోల ఆధారంగా ఈ విగ్రహన్ని తయారు చేశారు.  అయితే  1949లో తీసిన ఫోటోపైనే ఎక్కువగా ఆధారపడ్డారు.

మూడు వేల మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు  నిరంతరంగా శ్రమించడం వల్ల  ఈ నిర్మాణం పూర్తైంది.