Asianet News TeluguAsianet News Telugu

ప్రాణం కన్నా డబ్బు ముఖ్యమా..? రాష్ట్రాల పై కేంద్రం సీరియస్

కొత్త మోటారు వాహన చట్టాన్ని అనుసరించడం లేక నీరుగార్చడం అన్నది రాష్ట్రాల ఇష్టం. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కేంద్రం, రాష్ట్రాలు తమకు నచ్చినట్లు చట్టాలు చేసుకోవచ్చు. కానీ పెరుగుతున్న ట్రాఫిక్‌ ప్రమాదాలకు రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. 

States to Be Responsible for Safety of Their People, Says Nitin Gadkari on CMs Tweaking New Motor Vehicles Act
Author
Hyderabad, First Published Sep 12, 2019, 9:58 AM IST

ట్రాఫిక్ నియమాలను ఎవరూ సరిగా పాటించడం లేదని..ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త ట్రాఫిక్ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది.  ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానా విధించేలా నియమాన్ని తీసుకువచ్చింది. ఈ నిబంధన కారణంగా ఇప్పటికే పలువురు భారీ జరిమానాలను చవిచూశారు. దీంతో... ప్రజల నుంచి ఈ నిబంధన పట్ల వ్యతిరేకత మొదలైంది. అంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం సబబు కాదని చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనలు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్రం కాస్త దిగి వచ్చింది.

ఈ నిబంధననను అమలు చేయడం లేక మానడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ‘‘కొత్త మోటారు వాహన చట్టాన్ని అనుసరించడం లేక నీరుగార్చడం అన్నది రాష్ట్రాల ఇష్టం. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కేంద్రం, రాష్ట్రాలు తమకు నచ్చినట్లు చట్టాలు చేసుకోవచ్చు. కానీ పెరుగుతున్న ట్రాఫిక్‌ ప్రమాదాలకు రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. 

ఈ నియమం విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ కేవలం ఆదాయ మార్గంగా భావించి ఈ భారీ జరిమానాలను విధించాలని మేమీ చట్టం రూపొందించలేదు. ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో లక్షన్నర మంది చనిపోతున్నారు. ఇందులో 65 శాతం మంది యువతే! అయినా ఆందోళన ఉండదా? ట్రాఫిక్‌ చలాన్లను తగ్గిస్తారా? అంటే చట్టాన్ని ప్రజలు అనుసరించనక్కరలేదని చెప్పడమే! చట్టం అంటే భయం లేకపోవడమే’’ అని గడ్కరీ విమర్శించారు.

 ‘కొన్ని రాష్ట్రాలు ఈ కొత్త నిబంధనలను అనుసరించడం లేదు. ప్రాణం కన్నా డబ్బు ముఖ్యమా అని నేను వారిని అడుగుతున్నాను. ప్రమాదాలు తగ్గించాలని, ప్రాణాలు కాపాడాలన్న ఏకైక ఉద్దేశంతోనే మేం ఈ మార్పులు తెచ్చాం’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ దేశంలో దాదాపు 30 శాతం డ్రైవింగ్‌ లైసెన్సులు నకిలీవే. వాటిని ఏరిపారెయ్యడానికే ఈ జరిమానాలు. వాటికి ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios