ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం.. జామకాయలు పండిస్తూ కోట్ల ఆదాయం
ప్రస్తుత కాలంలో వ్యవసాయాన్ని చేయాలనుకునేవారు చాలా తక్కువ. నష్టాల కారణంగా వ్యవసాయాన్ని వదిలేస్తున్నవారు చాలా మందే ఉన్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మంచి జీతమొచ్చే ఉద్యోగాన్ని వదిలేసి మరీ వ్యవసాయం చేస్తున్నాడు. అది కూడా అద్దె భూమిలో. ఆశ్చర్యం ఏంటంటే.. ఇతని సంపాదన కోట్లలో ఉండటం..
విజయవంతమైన అగ్రిప్రెన్యూర్ రాజీవ్ భాస్కర్ గతంలో వీఎన్ఆర్ సీడ్స్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ మెంబర్ గా ఉద్యోగం చేసేవారు. కానీ ఆయన ఒక రైతుగా, పారిశ్రామికవేత్తగా ఎదుగుతారని అస్సలు అనుకోలేదు. విత్తనాల కంపెనీలో ఉన్న అతని అనుభవం భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులతో మాట్లాడేలా చేసింది. అలాగే వ్యవసాయంపై అతని ఆసక్తిని రేకెత్తించింది. రాజీవ్ థాయ్ జామను పండించిన రైతులతో మాట్లాడంతో.. ఆ థాయ్ జామ రకం గురించి, దాని వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు.
2017లో రాజీవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి హర్యానాలోని పంచకులలో ఐదెకరాల అద్దె భూమిలో థాయ్ జామకాయలను పండించాడు. పంట ఎదుగుదలను ప్రోత్సహించడానికి , రక్షించడానికి సేంద్రీయ పదార్థాల నుంచి తయారైన బయోసైడ్లు, బయోఫెర్టిలైజర్లను ఉపయోగించే అవశేషాలు లేని వ్యవసాయ పద్ధతులనే ఇతను ఉపయోగించాడు. నష్టం, తెగుళ్ల నుంచి రక్షించడానికి అతను మూడు-లేయర్ల బ్యాగింగ్ టెక్నిక్ ను కూడా ఉపయోగించాడు. ఈ జామకాయలు బాగా పండటానికి అన్ని చర్యలను తీసుకున్నాడు.
2017 అక్టోబర్, నవంబర్ నెలల్లో రాజీవ్ మొదటి పంట జామకాయలను కోసి అమ్మాడు. దీంతో అతను మొత్తం రూ.20 లక్షలు సంపాదించాడు. ఆ తర్వాత అతను రసాయనాలు లేని కూరగాయలను ఉత్పత్తి చేయాలనుకున్నాడు. కానీ దీనిలో విఫలమయ్యాడు. దీంతో అతను థాయ్ జామ సాగునే కొనసాగించడానికి నిర్ణయించుకుని పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో 55 ఎకరాల భూమిని మరో ముగ్గురు పెట్టుబడిదారులతో 2019లో లీజుకు తీసుకున్నాడు.
25 ఎకరాల భూమిలో రాజీవ్, అతని బృందం జామ చెట్లను నాటి సాగుచేస్తున్నారు. అలాగే పంచకుల తోట 5 ఎకరాలలో థాయ్ జామకాయలను పండిస్తున్నారు. వీరు వానాకాలం, శీతాకాలంలో అంటే ఏడాదికి రెండు సార్లు జామపంటను పండిస్తారు. కానీ ఇతర జామ రకాలు, అమ్మకందారుల నుంచి పోటీని తగ్గించడానికి వర్షాకాలంలో మాత్రమే జామకాయలు కోస్తారు. వీరు ఢిల్లీ ఏపీఎంసీ మార్కెట్ కు 10 కిలోల క్రేట్లలో తమ సరుకులను డెలివరీ చేస్తారు. వీరు ఎకరానికి సగటున రూ.10 లక్షల లాభం పొందుతున్నారు.
భవిష్యత్తులో జామ మొక్కల సగటు గరిష్ట దిగుబడిని మొక్కకు 25 కిలోల నుంచి 40 కిలోలకు పెంచాలనుకుంటున్నాడు రాజీవ్. రసాయనిక వ్యవసాయం తరచుగా ఉపయోగించని ప్రాంతాలలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించే ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఏదేమైనా చీడపీడల దాడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి పొరుగు పొలాలు రసాయనాలను ఉపయోగించే ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని నిర్వహించడం సవాలుతో కూడుకుని ఉంటుంది.
వి.ఎన్.ఆర్ సీడ్స్ కంపెనీలో రాజీవ్ కు ఉన్న అనుభవం ఆయనను వ్యవసాయాన్ని చేసేలా ప్రేరేపించింది. అలాగే థాయ్ జామకాయల అవశేషాలు లేని వ్యవసాయంలో అతని విజయం సుస్థిర వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ఇతర పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తుంది.