Hasanamba Temple Stampede : ప్రఖ్యాత హసనంబ ఆలయంలో కరెంట్ షాక్ తో తొక్కిసలాట.. 17 మందికి గాయాలు..
కర్ణాటకలోని ప్రముఖ హసనంబ ఆలయంలో దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడిన పలువురు భక్తులు కరెంట్ షాక్ కు గురయ్యారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల తొక్కిసలాట జరగడంతో పలువురు గాయపడ్డారు.
Hasanamba Temple Stampede : కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హసనంబ ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడటంతో కొంతమంది భక్తులకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఒక్క సారిగా ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మందికి గాయాలు అయ్యాయి. ధర్మ దర్శన్ క్యూ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
లైన్ లో నిలబడిన పలువురు భక్తులు షాక్ కు గురయ్యారు. వారిని తాకి ఉన్న మరి కొందరు భక్తులు చైన్ రియాక్షన్ వల్ల భయాందోళనకు గురవడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో క్యూలో ఉన్న మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇనుప బారికేడ్ లోపల వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
కాగా.. వార్త వెంటనే వ్యాప్తి చెందడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. వృద్ధులతో సహా ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో సంఘటనా స్థలం నుండి పారిపోవలసి వచ్చింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంత సమయం తరువాత అంతా సద్దుమణిగింది. కాగా.. ఈ షాక్ కారణంగా ఎనిమిది మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
ఈ ఆలయానికి సాధారణంగా ఎప్పుడూ పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈ ఘటన వల్ల భక్తులు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. దైవ దర్శనం కూడా ఆలస్యంగా జరిగింది. దీంతో భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించామని పోలీసులు తెలిపారు.