Asianet News TeluguAsianet News Telugu

ఉజ్జయిని: అసలే రద్దీ, ఆపై సీఎం రాక.. మహాకాళేశ్వరుడి ఆలయంలో తొక్కిసలాట

మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహంకాళేశ్వర్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భక్తుల్ని నిలిపివేయడంతో వారు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకురావడంతో ప్రమాదం జరిగింది. 
 

stampede like situation in ujjain temple due to vips ksp
Author
Ujjain, First Published Jul 27, 2021, 2:37 PM IST

మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహంకాళేశ్వర్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరు గాయపడగా. అందులో మహిళలు, చిన్నారులూ ఉన్నారు. భక్తులు పోటెత్తడంతో పాటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి వంటి ప్రముఖులు మహంకాళేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చారు. అయితే, అప్పటికే పోటెత్తిన భక్తులను ప్రోటోకాల్ పేరుతో గంటల తరబడి నిలిపివేశారు. దీంతో సహనం నశించిన భక్తులు లోపలికి చొచ్చుకొచ్చారు. వారిని నియంత్రించడం అక్కడ భద్రతగా ఉన్న పోలీసులవల్ల కాలేదు.

గేట్ నంబర్ 4 నుంచి భక్తులు తోసుకుంటూ లోపలికెళ్లే ప్రయత్నం చేశారు. బయటకెళ్లేవారినీ తోసుకుంటూ వచ్చేశారు. ఈ క్రమంలో ఓ భక్తుడు తోసుకొస్తున్న వారిపై చేయి చేసుకున్నాడు. అయినా వారు ఆగలేదు. దీంతో పిల్లలు సహా కొందరు కిందపడిపోయారు. ఘటనపై స్పందించిన ఉజ్జయిని కలెక్టర్ ఆశిష్ సింగ్.. వచ్చే సోమవారం ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు.

12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినికి.. సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారని కలెక్టర్ తెలిపారు. వాస్తవానికి ఒక్కరోజులో కేవలం 3,500 మంది భక్తులకే అనుమతినిస్తామని అంతకుముందు ఆలయ అధికారులు చెప్పారు. అది కూడా ప్రతి రెండు గంటలకు 500 మందినే లోపలికి పంపిస్తామన్నారు. దర్శనానికి వచ్చే వారికి కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. అది కాకుండా కనీసం ఒక డోసైనా వ్యాక్సిన్ వేసుకున్న వారినే అనుమతిస్తున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios