హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ మళ్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించిన కేసీఆర్ డీఎంకే చీఫ్ స్టాలిన్ ను కలవాల్సి ఉంది. 

సీఎం కేసీఆర్ షెడ్యూల్ ప్రకారం తెలంగాణ సీఎంవో ఈనెల 13న డీఎంకే అధినేత స్టాలిన్ ను కేసీఆర్ కలుస్తారంటూ స్పష్టం చేసింది. 13న కలిసేందుకు స్టాలిన్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. 

ఈనెల 19న తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. అయితే కేసీఆర్ కు స్టాలిన్ అపాయింట్మెంట్ ఖరారు చెయ్యకపోవడం వెనుక పెద్ద ఆలోచనే ఉందని తెలుస్తోంది. 

ఇప్పటికే స్టాలిన్ బీజేపీ యేతర పక్షాల తరపున పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుతం ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత లేదని స్టాలిన్ నమ్ముతున్నట్లు డీఎంకే వర్గాలు పరోక్షంగా స్పష్టం చేశాయి. 

డీఎంకే కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే స్టాలిన్ ను కేసీఆర్ కలవడం వెనుక ఉద్దేశం ఏంటా అన్నది అంతుపట్టని ప్రశ్నగా మారిపోయింది.  అందువల్లే కేసీఆర్ తో భేటీకి విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. 

స్టాలిన్ అపాయింట్మెంట్ వ్యవహారం బయటకు రావడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది. దీంతో స్టాలిన్ ఈనెల 12న కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కేవలం మర్యాదపూర్వకంగానే కలుస్తారని రాజకీయాల గురించే చర్చించే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. మరి కేసీఆర్ స్టాలిన్ ను కలుస్తారా లేక వెనుతిరుగుతారా అన్నది సస్పెన్షన్ గా మారింది.