Asianet News TeluguAsianet News Telugu

అళగిరిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

కరుణ కన్నుమూయక ముందే ఆయనను పార్టీలో చేర్చుకుంటారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానంపై అళగిరి చేసిన వ్యాఖ్యలు ఆయన్ని దూరంగానే ఉంచాయి.

stalin sensational comments on brother alagiri
Author
Hyderabad, First Published Aug 28, 2018, 2:50 PM IST

డీఎంకే అధినేతగా నేడు స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. ఇలా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. తన సోదరుడు అళగిరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సోదరి మాత్రమే ఉందని.. సోదరుడు లేడని వ్యాఖ్యానించారు.  ఒక్కసారిగా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు అందరూ షాక్ కి గురయ్యారు.  అళగిరిని ఇటీవల పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ రోజు బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ కార్యకర్తలతో మాట్లాడుతూ.. అళగిరిపై అసహనం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రిగా పనిచేసిన స్టాలిన్ సోదరుడు అళగిరి డీఎంకే దక్షిణభాగ ప్రిసీడియం చైర్మన్‌గా ఉన్న సమయంలోనే (నాలుగేళ్ల క్రీతం) పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు. ఆయనకు మళ్లీ పార్టీలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కరుణ కన్నుమూయక ముందే ఆయనను పార్టీలో చేర్చుకుంటారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానంపై అళగిరి చేసిన వ్యాఖ్యలు ఆయన్ని దూరంగానే ఉంచాయి. దీంతో ఆయన పార్టీపై పోరుకు సిద్ధమయ్యారు. తన అనుయాయులతో కలిసి స్టాలిన్‌ను దెబ్బకొడతానని బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు.
 
ఇక పోతే డీఎంకే తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్న తన సోదరి కనిమొళి పార్టీలోనే కొనసాగుతోంది. తండ్రి మరణం అనంతరం స్టాలిన్‌కే పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రతిపాదనకు కనిమొళి కూడా మద్దతు తెలిపింది. పైగా పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఆవిడ ప్రమేయం కూడా అంతగా ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
 
మొదటి నుంచి కరుణానిధికి చేదోడు వాదోడుగా ఉంటూ.. పార్టీకి సంబంధించిన అన్ని పనులూ స్టాలినే చూసుకుంటున్నారు. కరుణానిధి తీవ్ర అనారోగ్యం పాలయ్యాక ‘యాక్టింగ్ ప్రెసిడెంట్’ అనే పదవిని తెరపైకి తీసుకువచ్చి పార్టీ బాద్యతలన్నీ ఆయనే చూసుకున్నారు. తనను కాదని తనకంటే చిన్నవాడైన స్టాలిన్‌కు పార్టీలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పట్ల చిన్నబుచ్చుకున్న అళగిరి.. అప్పటి నుంచి సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ వచ్చారు. అనంతరం పార్టీ నుంచి వేటుకు గురయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios