చెన్నై: తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికల్లో  డీఎంకె అధికారాన్ని చేపట్టే దిశగా దూసుకుపోతోంది. 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీ అధికారాన్ని చేపట్టనుంది. కరుణానిధి మరణించిన తర్వాత డిఎంకెను అన్నీ తానై నడిపించిన స్టాలిన్ పార్టీని  విజయం వైపునకు తీసుకెళ్లారు. కరుణానిధి బతికి ఉన్న సమయంలో  డిఎంకె చీఫ్ గా  స్టాలిన్ కు  కరుణానిధి బాధ్యతలను అప్పగించారు.  2018 ఆగష్టులో స్టాలిన్ డిఎంకె చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు.

ఈ పరిణామం స్టాలిన్ సోదరుడు అళగిరికి రుచించలేదు. అళగిరి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.  ఈ పరిణామం తర్వాత ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కొత్త పార్టీ పెట్టేందుకు అళగిరి ప్రయత్నాలు చేశారనే ప్రచారం కూడ సాగింది. మరోవైపు బీజేపీలో చేరుతారనే ఊహగానాలు సాగాయి.అళగిరి సహకారం లేకున్నా కూడ  డిఎంకెను అధికారంలోకి తీసుకురావడంలో  స్టాలిన్  కీలకంగా వ్యవహరించారు.  డిఎంకెలో కరుణానిధి తర్వాత  తమిళనాడు సీఎం పదవిని చేపట్టేది స్టాలిన్ . ఈ ఎన్నికల్లో స్టాలిన్ సీఎం అభ్యర్థిగా డిఎంకె కూటమి ప్రచారం చేసింది.  

తమ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉండేలా డిఎంకె చివరివరకు ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ కోరిన సీట్లు ఇవ్వనప్పటికీ రెండు పార్టీలకు ప్రయోజనం కలిగేలా కూటమిలో సీట్ల సర్ధుబాటు జరిగేలా స్టాలిన్ కీలకంగా వ్యవహరించారు. 1984లో చెన్నైలోని థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1984లో తొలిసారిగా ఆయన పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1989 ఎన్నికల్లో ఈ స్థానంలో స్టాలిన్ విజయం సాధించారు. 1996 నుండి వరుసగా ఆయన మూడుసార్లు ఈ స్థానం నుండి విజయం గెలుపొందారు. 2011 నుండి స్టాలిన్ కోలాథూర్ నుండి పోటీ చేశారు. 

డిఎంకెలో కరుణానిధి తర్వాత గోపాలస్వామి, వైకోలు  వారసులుగా ప్రచారం సాగింది.  అయితే వైకోను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనపై వేటేసింది డీఎంకె. ఇదే సమయంలో  డిఎంకెలో స్టాలిన్ అంచెలంచెలుగా తన పట్టును పెంచుకొన్నాడు. సాధారణ ప్రజలతో  స్టాలిన్ సంబంధాలు ఏర్పాటు చేసుకొన్నాడు. 1980 నుండి 1990 మధ్య కాలంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఆయన పర్యటించారు.  కరుణానిధి పార్టీ చీఫ్ గా ఉన్న సమయంలో, సీఎంగా ఉన్న సమయంలో  కీలకంగా వ్యవహరించిన నేతలకు పార్టీలో స్టాలిన్ ప్రాధాన్యతను కల్పించారు.