త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ రాష్ట్రాల్లో త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరిగితే... నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది.
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈశాన్య భారతంలో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో నేటీ కౌంటింగ్ పర్వం చాలా ఆసక్తిగా, ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ గెలిచి.. అధికార పగ్గాలను చేజిక్కించుకుంటేందో మరికాసేపటిలో తెలుస్తుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది.
60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగగా, మేఘాలయ, నాగాలాండ్‌లు ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. ఈ 3 రాష్ట్రాల ఫలితాలతోపాటూ.. దేశవ్యాప్తంగా మరో 4 రాష్ట్రాల్లోని 5 స్థానాలకు కూడా ఇవాళ ఫలితాలు రానున్నాయి. అవి అరుణాచల్ ప్రదేశ్‌లోని లుమ్లా, మహారాష్ట్రలోని కస్బాపేత్-చింద్వాడ్, తమిళనాడులోని ఈరోడ్, బెంగాల్‌లోని సగర్డిఘీ, జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ స్థానాలు.
త్రిపుర
త్రిపురలో ఒకే విడతలో పోలింగ్ జరగగా.. దాదాపు 88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. త్రిపురలో ప్రధానంగా అధికార BJP, లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి,TMP (తిప్రా మోతా) మధ్య పోటీ జరగనున్నది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. త్రిపురలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. ఇక్కడ 2018 వరకూ లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉండగా.. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది.
మేఘాలయ
మేఘాలయలో 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఫిబ్రవరి 27న పూర్తయింది, ఈ ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. ఇక్కడ నేషనలిస్ట్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌పిపి), బిజెపి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎన్‌పీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. టిఎంసి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషించాలని భావిస్తోంది. ఇది కాకుండా మేఘాలయలో చిన్న పార్టీలు పెద్ద పార్టీలకు గట్టి పోటీ ఇవ్వగలవని విశ్లేషకుల అంచనా.
నాగాలాండ్
59 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ కు ఫిబ్రవరి 27న ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడనున్నాయి. నాగాలాండ్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి మరియు సిట్టింగ్ ఎమ్మెల్యే కజెటో కినిమి జున్హెబోటో జిల్లాలోని అకులుటో స్థానం నుండి ఎన్నికలలో ఏకపక్షంగా విజయం సాధించారు.
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు 83 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వి శశాంక్ శేఖర్ తెలిపారు. ఇక నాగాలాండ్‌లో కూడా బీజేపీ, తన సంకీర్ణ భాగస్వామి అయిన నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP)తో కలిసి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా.
2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టాలంటే..ఈ ఎన్నికల ఫలితాలు చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఈ ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టి.. ఇతర పార్టీలతో కలిసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి.
